తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత తొలి విడత కార్పొరేషన్ పదవుల పందారం పూర్తయింది.. రెండో విడత పదవుల జాతరకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు డైలమాలో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. కార్పొరేషన్ పదవుల కోసం ప్రయత్నం చేయాలా లేక పార్టీ పదవి కోసం లాబీయింగ్ చేయాలో అర్థం కాక ఫుల్ కన్ఫ్యూషన్ లో ఉన్నారట.. పిసిసి చీప్ గా మహేష్ గౌడ్ నియామకం తరువాత.. మిగిలిన పదవులను భర్తీ చేసేందుకు ఏఐసీసీ సిద్ధమవుతోంది.. ఈ క్రమంలో ఏ పదవులకు పోటీ పడాలో నేతలకు అర్థం కావడం లేదట..
ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో.. నామినేటెడ్ పదవులు కంటే పార్టీ పదవులతోనే లాభం ఉంటుందనే భావనలో నేతలు ఉన్నారని ప్రచారం జరుగుతుంది. కార్పొరేషన్ పదవులు దాదాపు 40 పైగా ఖాళీలు ఉన్నాయి. అయితే వాటి పదవికాలం కేవలం రెండేళ్లు మాత్రమే ఉండడంతో.. తర్వాత రాజకీయ భవిష్యత్తు ఏంటనే ఆందోళనలో సీనియర్ నేతలు ఉన్నారు. ప్రస్తుతానికి కార్పొరేషన్ పదవులు తీసుకుని, తర్వాత పార్టీలో పదవి దక్కించుకోవాలనే ఆలోచనలో పలువురు సీనియర్ నేతలు ఉన్నారట. ఇందుకోసం ఏఐసీసీ పెద్దల వద్ద ముందుగానే హామీ తీసుకుంటున్నట్లు పార్టీలో చర్చ నడుస్తుంది.. పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న నేతలందరూ… తమకు నచ్చిన పదవులు కేటాయించాలంటూ అధిష్టానం పై ఒత్తిడి తీసుకొస్తున్నారట..
రెండో విడత కార్పొరేషన్ పదవుల భర్తీపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా దృష్టి పెట్టింది.. పార్టీ కోసం సుదీర్ఘ కాలంగా పనిచేసిన నేతలతో పాటు గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది.. ఎక్కడా అసంతృప్తి రాగాలు వినపడకుండా ఆచితూచి జాబితాను సిద్ధం చేస్తుందట.. సీనియర్ లందరికీ ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానాన్ని రాష్ట్ర నాయకత్వం కోరిన నేపథ్యంలో పదవుల ఎంపిక వారికి కత్తి మీద సాముగా మారిందని గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.. మొత్తంగా సీనియర్ నేతలకు ప్రభుత్వ పదవి దక్కుతుందో లేక పార్టీ పదవి దక్కుతుందో చూడాలి మరి..