భారత ప్రధాని నరేంద్ర మోదీపై తనకు ఎటువంటి ద్వేషం లేదని కాంగ్రెస్ ఎంపీ, లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఆలోచనా విధానాన్ని విభేదిస్తాను తప్పా ఆయన్ను ద్వేషించడం లేదని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. టెక్సాస్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పై వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ మంగళవారం సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. రాహుల్ మాట్లాడుతూ.. మోదీ ఆలోచనలు వేరు, తన ఆలోచనా విధానం వేరని రాహుల్ వెల్లడించారు.వాస్తవానికి కొన్ని విషయాల్లో ఆయన పట్ల తనకు సానుభూతి ఉందన్నారు.
వినడానికి ఇది మీకు ఆశ్చర్యం కలిగించినా, ఇదే నిజం అని అన్నారు.తనకు మోదీ అంటే ద్వేషం లేదని విద్యార్థులకు చెప్పుకొచ్చారు. మోదీ వర్సెస్ రాహుల్ అంటూ పోల్చడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఇదే తన అభిప్రాయమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మూడు రోజుల పర్యటన కోసం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో విద్యార్థులు,స్థానిక భారత సంతతి అమెరికన్లతో రాహుల్ ముచ్చటించారు.