ఆంధ్రప్రదేశ్ లో బలపడటానికి ప్రయత్నాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పలు పార్టీలను కలుపుకుని వెళ్ళే ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే వామపక్షాలతో కలిసి అమరావతి ఉద్యమాన్ని చంద్రబాబు ముందు ఉండి నడిపిస్తున్నారు. ఇక ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి కూడా చంద్రబాబు వామపక్షాలు, ప్రధానంగా సిపిఐ తో ఎక్కువ ఆరోపణలు చేయించారు.
సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పదే పదే జగన్ సర్కార్ పై విమర్శలు చేసారు. అయితే ఇప్పుడు ఆయన వెనక్కు తగ్గారని అంటున్నారు. జగన్ సర్కార్ కి అనుకూలంగా మారిపోయారని అంటున్నారు. తమను మోసం చేసిన జనసేన పార్టీ తో చంద్రబాబు స్నేహం పరోక్షంగా స్నేహం చేయడంపై సిపిఐ ఆగ్రహంగా ఉంది. తాజాగా జగన్ సర్కార్ పై రామకృష్ణ ప్రసంశల వర్షం కురిపించారు.
వైద్య సిబ్బందికి, మున్సిపల్, కాంట్రాక్ట్ కార్మికులకు పూర్తి జీతాలు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేసారు. కరోనాను ఎదుర్కొనేందుకు ముందుండి పోరాడుతున్న వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసారు. ఒక వైపు చంద్రబాబు విమర్శలు చేస్తున్న తరుణంలో రామకృష్ణ ప్రసంశలు కురిపించడం ఆశ్చర్యంగా మారింది. ఇది చంద్రబాబుకి పెద్ద షాక్ అని అంటున్నారు.