మంత్రి ధర్మాన స్టేట్మెంట్ ఓ సారి చూడండి
రాజ్యసభకు ఆర్.కృష్ణయ్యను ఎంపిక చేస్తే తెలంగాణ వ్యక్తి అంటున్నారు. చంద్రబాబు ఎక్కడ ఉంటున్నారు. ప్రాంతం కాదు ముఖ్యం.. బీసీ వర్గాలకు ఆయన చేసిన కృషి ని గుర్తించాం.. ఇదీ ధర్మాన అంటున్న మాటలు. వినేందుకు కాస్త విడ్డూరంగా ఉన్నాయి కూడా! అందుకే సొంత మనుషులే ఈ మాటలు విని ఆశ్చర్యపోతున్నారు. ప్రాంతేతరులకు పదవుల కేటాయింపు అన్నది భావ్యంగా లేదని ఓ వైపు కిల్లి కృపారాణి వర్గీయులు గగ్గోలు పెడుతుంటే, వారితో పాటే ఇంకొందరు ఆశావహులు నిట్టూరుస్తుంటే.. అందుకు భిన్నంగా ధర్మాన ఓ సమర్థనీయ ధోరణిలో మాట్లాడడమే కాకుండా.. ఇదే సందర్భంలో పనిలో పనిగా బస్సు యాత్ర (సామాజిక న్యాయభేరి) ఎందుకు చేపట్టబోతున్నామో కూడా చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొడుతూ, వాస్తవాలు వివరిచేందుకే తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని కూడా వివరించారు. బీసీ కార్డును నమ్ముకుని ఉన్న జగన్ కు మరో బీసీ నేత ఇంతటి సమర్థనీయ స్థాయిలో మాట్లాడడం మంచిదే కానీ, పనిలో పనిగా అధికార పార్టీకి చెందిన ఇతర బీసీ నేతల నుంచి వస్తున్న విమర్శలను కూడా ధర్మాన పరిగణనలోకి తీసుకుంటే మేలు అన్న వాదన ఒకటి వినపడుతోంది.
ధర్మాన మాటలను
ఇంకాస్త విశ్లేషిస్తే..విస్తరిస్తే..
మామూలుగానే శ్రీకాకుళం జిల్లా నేత అయిన ధర్మాన ప్రసాదరావు మాటలు చాలా ట్రికీగా ఉంటాయి. ట్రిక్ అండ్ ట్రికీ విధంగా సాగే మాటల్లో వాస్తవాలు అంత వేగంగా పట్టుకోలేం. ఆ విధంగా నిన్నటి వేళ ఆయన చెప్పిన కొన్ని మాటలు జగన్ నిర్ణయాలను భలే సమర్థిస్తున్నాయి. కానీ వీటిలో ఉండే నిజాలు కన్నా ఆయన మాట చేసే మాయ కానీ మాటతో చేసే గారిడీ కానీ విభిన్నంగా ఉంటుంది. మామూలుగా మాట్లాడే మాటల్లో కూడా ధర్మాన ప్రసాదరావు ఆంతర్యం అంత వేగంగా అంతుపోలదు. ఇంత మంది మంత్రులు ఉన్నా కూడా జగన్ కోటరీకి ఆ స్థాయిలో మాట్లాడే మనిషి మరొకరు దొరకడం లేదు కూడా! వైఎస్సార్ హయాం నుంచి ధర్మాన మంచి మాటకారి అన్న పేరుంది. రోశయ్య సర్కారులోనూ తరువాత కిరణ్ సర్కారులోనూ ఆయన తన హవాను కొనసాగించిన వైనం ఇప్పటికీ చర్చకు వస్తూనే ఉంటుంది.
బీసీల గురించి మాట్లాడినా లేదా మరొక విషయమై మాట్లాడినా ధర్మాన మాటలో ఉన్న టెక్నిక్ అన్నది అంత వేగంగా మీడియాకు చిక్కదు. పట్టి పట్టి అర్థం చేసుకుంటే కానీ ఆయనకు ఏ విషయంలో భేదం ఉంది ఏ విషయంలో అనుకూలత ఉంది అన్నవి అంతు చిక్కవు. అందుకే ఆయన ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్నారు కూడా ! ఆ రోజు మరియు ఈ రోజు కూడా ఆ చాకచక్యం కారణంగానే నెగ్గుకు వస్తున్నారు. స్వభావ రీత్యా అంత వేగంగా మాట జారరు. అదేవిధంగా ఆకట్టుకునే విధంగా బహిరంగ సభల్లో మాట్లాడగలరు. ఇంకా చెప్పాలంటే సంక్షేమ పథకాల గురించి ఆ మధ్య ఆయన చెప్పిన లాజిక్ విని పసుపు దండు మళ్లీ మరో మాట చెప్పలేకపోయింది.
అంటే రాజ్యాంగం కల్పించిన హక్కు జీవించే హక్కు.. ఆ హక్కును ప్రజా స్వామ్య పద్ధతిలో చట్ట సభలు గౌరవిస్తూనే, సంబంధిత ప్రభుత్వాలు అమలు చేయడం ఓ విధి అని చెప్పి ఆశ్చర్యపరిచి, తన మాటకు ఎదురులేదని అన్నారు. అవునవును ! సంక్షేమం ప్రజల హక్కు కాదనం కానీ అప్పులు చేసి మేం డబ్బులు పంచమని చెప్పామా అని బీజేపీ కౌంటర్లు ఇచ్చినా అవేవీ సోషల్ మీడియాలో ఫోకస్ కాలేదు.