అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య తొలిసారిగా ముఖాముఖి చర్చ ప్రారంభమైంది. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల మధ్య ప్రత్యక్ష చర్చ ఆనవాయితీగా వస్తున్నది. ఈ నేపథ్యంలో వివిధ అంశాలపై ఇరువురు అభ్యర్థులు తమ వాదనలు వినిపిస్తున్నారు. ట్రంప్, బైడెన్ మధ్య అమెరికా అధ్యక్ష చర్చ సంధానకర్తగా క్రిస్ వాలెస్ వ్యవహరిస్తున్నారు. కాగా కరోనా నేపథ్యంలో ఈ సారి అధ్యక్ష అభ్యర్థుల మధ్య కరచాలనం లేకుండానే చర్చ ప్రారంభమైంది.
మొదటి అంశంగా అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో వచ్చిన ఆరోపణలు, విమర్శలపై మొదటి ప్రశ్నతో ముఖాముఖి ప్రారంభమైంది. ప్రజారోగ్య సక్షోభంపై ప్రజలు మిమ్మల్నే ఎందుకు నమ్మాలని, కరోనా సంక్షోభాన్ని ప్రత్యర్థికంటే మెరుగ్గా ఎలా ఎదుర్కోగలరని రెండో ప్రశ్న అడిగారు. ఒబామా కేర్‌ను రద్దు చేసి, ట్రంప్ తీసుకొచ్చిన కొత్త ఆరోగ్య బీమా పథకంపై ఇరువురు నేతలు తమ వాదన వినిపించారు. కరోనా వ్యాప్తిని నిలువరించడంతో ట్రంప్ విఫలమయ్యారని, కరోనా వ్యాక్సిన్‌పై ట్రంప్ మాటలు నమ్మేలా లేవని డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విమర్శించారు. అయితే అమెరికన్లకు మెరుగైన వైద్యం అందించాలన్నదే తన అభిమతం అని ట్రంప్ ప్రకటించారు. మరికొన్ని వారాల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.