ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్-19 రెండో దశ త్వరలోనే ప్రారంభం కానుందా… ? మరోసారి ఈ మహమ్మారి అన్ని దేశాల్లోనూ ప్రతాపం చూపించనుందా.. ?… ఈ ప్రశ్నలకు వైద్య నిపుణులు అవుననే సమాధానం ఇస్తున్నారు. ఇప్పటికే యూరప్‌లోని కొన్ని దేశాల్లో కరోనా రెండో దశ ప్రారంభం కావడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. బ్రిటన్, స్పెయిన్, రష్యా, ఇజ్రాయెల్ తదితర దేశాల్లో ఇటీవల మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. త్వరలో అమెరికాలోనూ ఇదే పరిస్థితి రానుందని అంచనా వేస్తున్నారు. అక్కడి కళాశాలల క్యాంప్‌సలకు విద్యార్థులు తిరిగి రావడం వైరస్ వ్యాప్తికి దారితీసింది.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 10 లక్షలు దాటేసింది. 2004లో వచ్చిన సునామీలో మరణించిన వారికంటే నాలుగు రెట్లు అధికం. గత వేసవిలో కరోనా మృతదేహాలతో ఇటలీలోని శ్మశాన వాటికలు కిటకిటలాడాయి. 9 నెలలుగా అన్ని దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రజల జీవన, పనిచేసే విధానాన్ని సమూలంగా మా ర్చేసింది. దీనికి టీకా అందుబాటులోకి రావడానికి ఇంకా కొన్ని నెలలు పడుతుందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా కేసులు పెరుగుతోంది భారత దేశంలోనే. ఇక్కడ మరణాలు 96 వేలు దాటేశాయి. అత్యధిక మృతుల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, బ్రెజల్, భారత్ వరుసగా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.