లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నిక పోలింగ్‌ను అక్టోబర్ 9న నిర్వహించాలని ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 12న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నిక ప్రక్రియ మొత్తం అక్టోబర్ 14లోపు ముగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. కాగా ఈ స్థానానికి ఏప్రిల్ 7న పోలింగ్ జరగాల్సి ఉంది. ఇంతలోగా లాక్‌డౌన్ అమలులోకి రావడంతో పోలింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఆగస్టు నెలలో ఈ పోలింగ్ ప్రక్రియ ఉంటుందని అందరూ భావించారు.
కానీ ఎట్టకేలకు వచ్చే నెల 9న ఈ ప్రక్రియను చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గెలుపు లాంఛనమే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితతో పాటు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొత్తం ఓటర్లలో 75 శాతం మంది టీఆర్‌ఎస్‌కు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే ఉన్నందున కవిత ఎన్నిక లాంఛనమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.