ఏపీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు స‌ర్వం సిద్ధం..!

-

Every thing is ready for Ap ministerial expansion
మైనార్టీ, గిరిజ‌న నేత‌ల‌తో చంద్ర‌బాబు స‌మావేశం
మంత్రివ‌ర్గంలోకి ఫ‌రూఖ్‌, కిడారి శ్రావ‌ణ్‌లు
మండ‌లి చైర్మ‌న్‌గా ఎమ్మెల్సీ ష‌రీఫ్‌
క‌దిరి ఎమ్మెల్యే చాంద్‌బాషాకు విప్‌తో స‌రి

టీడీపీ ముస్లిం మైనార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు శ‌నివారం సమావేశమయ్యారు. మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించే విషయంలో జాప్యం జరగడానికి గల కారణాలను చంద్రబాబు వివరించారు. ముస్లిం ఎమ్మెల్యేలకు భవిష్యత్‌లో మంచి అవకాశాలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. జాతీయస్థాయిలో మోదీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ముస్లింలను సమీకరించుకొని వెళ్లాలని చంద్రబాబు టీడీపీ ముస్లిం మైనార్టీ నేతలకు సూచించారు. మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటున్న శాసనమండలి ఛైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్, కిడారి శ్రవణ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. మంత్రివర్గంలో అవకాశం ఇస్తున్నట్టు వారికి చెప్పారు. కేబినెట్ సహచరులతో పాటు జిల్లా నేతలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. కిడారి శ్రవణ్‌కు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. చిన్న వయస్కుడువైనా మంత్రిగా అవకాశం ఇస్తున్నామని, సద్వినియోగం చేసుకొని పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం ముస్లిం మైనార్టీ నేతలతో సీఎం భేటీ అయ్యారు. వారికి కీలక పదవులు ఇస్తూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌ఎండీ ఫరూక్‌కు ఇప్పటికే మంత్రి పదవి ఖరారు కాగా.. శాసనమండలి ఛైర్మన్‌గా షరీఫ్‌, అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌గా కదిరి ఎమ్మెల్యే చాంద్‌ బాషాను ఖరారు చేశారు.

శాస‌న‌మండ‌లికి ఫరూక్ రాజీనామా

మంత్రిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్న ఫరూక్‌ శాసనమండలి ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. మంత్రి వర్గ విస్తరణ కోసం ఆదివారం ఉద‌యం విజయవాడకు రానున్న గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఆదివారంనాటి ప్రజావేదికలో మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ హైదరబాద్‌కు తిరుగు పయనమవనున్నారు. ఆదివారం ఉదయం 11.45 గంటలకు ఉండవల్లిలోని ప్రజా వేదికలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఆదివారం కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావు తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేయడంతో… మంత్రి వర్గంలో రెండు స్థానాలు ఖాళీ అయిన విషయం విదితమే. రాష్ట్ర మంత్రివర్గంలో ఇంతవరకు ముస్లిం మైనార్టీ, ఎస్టీ వర్గాలకు చోటు లేకపోవడంతో ఆ రెండు స్థానాలను వారితో భర్తీ చేయాలని భావించారు. కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌ నేత, శాసనమండలి ఛైర్మన్‌ ఎన్‌.ఎం.డి.ఫరూక్‌, ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రావణ్‌ కుమార్‌లతో వీటిని భర్తీ చేయనున్నారు. ఫరూక్‌కి మైనారిటీ సంక్షేమంతో పాటు మరికొన్ని శాఖలు, శ్రావణ్‌కు గిరిజన సంక్షేమంతో పాటు, ఒకటి రెండు ఇతర సంక్షేమ శాఖలు అప్పగించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. శ్రావణ్‌ వారణాసిలోని ఐఐటీ బీహెచ్‌యూలో ఇంజినీరింగ్‌ చదివారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వనున్నారు. ఆయన సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. సర్వేశ్వరరావుతో పాటు, మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు మాజీ శాసనసభ్యుడు సివేరి సోమ కుమారుడిని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా నియమించనున్నారు.

ఫ‌రూక్‌, శ్ర‌వ‌ణ్‌ల నేప‌థ్య‌మిది!

28 ఏళ్ల రాజకీయ ప్రస్థానం..!
ఎన్‌.ఎం.డి.ఫరూక్‌ కర్నూలు జిల్లా నంద్యాలలో 1950 మే 15న జన్మించారు. హయ్యర్‌ సెకండరీ విద్యను అభ్యసించారు. ఆయన భార్య పేరు ఎన్‌.మహబూబ్‌ చాంద్‌. వారికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. 1981లో ఆయన నంద్యాల మున్సిపల్‌ కౌన్సిలర్‌గా, వైస్‌ ఛైర్మన్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. తెదేపా ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరి… 1985లో నంద్యాల శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో వక్ఫ్‌ బోర్డు, చక్కెర పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. 1994లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. 1999 ఎన్నికల్లో మరోసారి గెలిచి… చంద్రబాబు మంత్రివర్గంలో పురపాలక, మైనారిటీల సంక్షేమం, వంటి శాఖలను నిర్వహించారు. 2017లో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులై, శాసనమండలి ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

ఐఏఎస్‌ అధికారి కావాలనుకొని..!
కిడారి శ్రావణ్‌కుమార్‌ స్వస్థలం… విశాఖ జిల్లా పెదబయలు మండలం నడింవాడ గ్రామం. ఆయన తండ్రి కిడారు సర్వేశ్వరరావు ఎమ్మెల్సీగా, అరకు ఎమ్మెల్యేగా, శాసనసభలో ప్రభుత్వ విప్‌గా పని చేశారు. శ్రావణ్‌కుమార్‌ వారణాసిలోని ఐఐటీ బీహెచ్‌యూలో ఇంజినీరింగ్‌ చదివారు. సివిల్‌ సర్వీసెస్‌కి ఎంపికవడం ఆయన లక్ష్యం. దాన్ని సాధించేందుకు దిల్లీలో ఉంటూ సివిల్స్‌ పరీక్షలకు శిక్షణ పొందుతున్నారు. తండ్రి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో… ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు రాజకీయాల్లోకి వస్తున్నారు. శ్రావణ్‌ 1990 జూన్‌ 14న జన్మించారు. ఎనిమిదో తరగతి వరకు పెదబయలులోని సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌లో చదువుకున్నారు. విశాఖలో ఇంటర్మీడియెట్‌ చదివారు.

మార్పులు ఎందుకంటే…
మంత్రుల శాఖల్లోను స్వల్పంగా మార్పులు చేసే అవకాశం ఉంది. కామినేని శ్రీనివాస్‌ నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖను ఆయన రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు. మాణిక్యాలరావు నిర్వహించిన దేవాదాయశాఖను ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి అప్పగించారు. ఈ రెండూ కీలకమైన శాఖలు కావడం, వీటికి సంబంధించిన అంశాలు తరచూ చర్చనీయాంశం అవుతుండటంతో సీనియర్‌ మంత్రులకు కేటాయించే అవకాశం ఉంది. ఆ మేరకు సంబంధిత మంత్రులు ప్రస్తుతం నిర్వహిస్తున్న శాఖల్లోను స్వల్ప మార్పులు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news