బ‌డ్జెట్ మే స‌వాల్‌.. జ‌గ‌న్ వ్యూహం ఏంటి..!

-

ఏపీ సీఎం జ‌గ‌న్ కు బ‌డ్జెట్ స‌వాల్‌గా మార‌నుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు పాల‌న న‌ల్లేరుపై న‌డ‌కగానే సాగిపో యినా.. ఇప్పుడు వ‌చ్చే సెప్టెంబ‌రు మాసం నుంచి రాష్ట్రంలో సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు ఆర్థికంగా అనేక ఒత్తిడులు పెరుగుతున్నారు. గ‌త పాల‌న‌లో ఇబ్బడి ముబ్బ‌డిగా చంద్ర‌బాబు చేసిన అప్పుల తాలూకు వ‌డ్డీలు కూడా ఇప్పుడు జ‌గ‌న్‌కు అత్యంత భారంగా ప‌రిణ‌మిస్తున్నాయి. పాల‌న ప‌గ్గాలు చేప‌ట్టి జ‌గ‌న్‌కు రెండు మాసాలే గ‌డిచినా.. వ‌చ్చే నెల నుంచి సంక్షేమ ప‌థ‌కాల‌కు అడుగులు వేస్తున్నారు. అదేస‌మ‌యంలో మ‌ద్య నిషేధంలో భాగంగా బెల్టు షాపుల‌ను త‌గ్గించుకున్నారు.


రాబోయే అక్టోబ‌రు 1 నుంచి 22% మ‌ద్యం దుకాణాల‌ను త‌గ్గించి.. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనే వీటిని న‌డ‌ప‌నున్నారు. దీంతో ఆదాయం త‌గ్గుతోంది. ఇక‌, ఇసుక‌లేని కార‌ణంగా నిర్మాణ రంగం కుదేలైంది. ఫ‌లితంగా అన్ని విధాలా ఆదాయం ఒకింత త‌గ్గింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ అమ‌లు చేయ‌బోయే ప‌థ‌కాలు, వాటి ఖ‌ర్చుల‌ను ప‌రిశీలిస్తే.. ఆదాయానికి వ్య‌యానికి మ‌ధ్య కొద్దిగా తేడా వ‌స్తొంది. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ప్రభుత్వం నవరత్నాల కింద కొన్ని సంక్షేమ పథకాలు ప్రారంభించనుంది.

ఈ రెండు నెలలకు గాను తప్పనిసరి ఖర్చులు పోను అదనంగా రూ.15,230 కోట్లు కావాలని ఆర్థికశాఖ అంచనా. సెప్టెంబరులోనే అదనంగా రూ.8,630 కోట్లు అవసరమవుతాయి. ఇందులో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.1,800 కోట్లు, పంటల బీమాకు రూ.1,100 కోట్లు, వైఎస్సార్‌ బీమాకు రూ.550 కోట్లు, గండికోట, ఇతర ప్రాజెక్టుల కోసం రూ.1,000 కోట్లు, ట్యాక్సీ డ్రైవర్లకు సహాయం కోసం రూ.400 కోట్లు, క్రీడల మౌలిక సదుపాయాల కోసం రూ.20 కోట్లు, ఎన్‌టీపీసీకి రుణ చెల్లింపుల కింద రూ.3,500 కోట్లు, గ్రామ వలంటీర్లకు నెలకు రూ.100 కోట్లు అవసరం.

ఇక అక్టోబరులో అదనంగా 6,600 కోట్ల వరకు అవసరమవుతాయి. వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని అక్టోబరు 15 నుంచి ప్రారంభిస్తున్న నేపథ్యంలో దీనికి రాష్ట్ర వాటాగా రూ.5,500 కోట్లు చెల్లించాలి. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలకు, స్మార్ట్‌ సిటీల పథకానికి పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో రూ.1,000 కోట్లను అక్టోబరులో చెల్లించాలి. ఈ నేప‌థ్యంలో ఆదాయానికి వ్య‌యానికి మ‌ధ్య పొంతన కుద‌ర‌డం లేదు. దీంతో వ‌చ్చే రోజుల్లో జ‌గ‌న్‌కు ఆర్థిక వ్య‌వ‌స్థ పెను స‌వాలే విస‌ర‌నుంది. మ‌రి ఆయన వ్యూహం ఏంటో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news