తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో చాలా వరకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా ఆయా ప్రాంతాలు వరద నీటలోనే ఉన్నాయి. వరద ఉధృతి నెమ్మదిగా తగ్గుతుండటంతో ప్రజలు తమ ఇళ్లకు వెళ్తున్నారు. మరికొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.వర్షాలు, వరద నీరు తగ్గాలని దేవుడిని వేడుకుంటున్నారు.అయితే, సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించి వారికి అన్ని సహాయక సహకారాలు అందిస్తామని చెప్పారు.
ముంపు బాధితులకు రూ.10వేల నష్టపరిహారం ప్రకటించారు. అయితే, ఈ మొత్తాన్ని మరింత పెంచాలని ముంపు గ్రామాల బాధితులు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. ఎందుకంటే ఇంట్లోకి వరద నీరు రావడంతో సామగ్రి మొత్తం తడిచిపోయింది. పప్పులు, ఉప్పులు, బియ్యం, ఎలక్ట్రానిక్ వస్తువులు, డబ్బులు, సర్టిఫికెట్లు మొత్తం పాడైపోయాయి.ఇక బైకులు, పలు వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. దీంతో తాము ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే వరద సాయాన్ని పెంచాలని కోరుతున్నారు. తడిచిపోయిన సామగ్రిని బయట ఆరబెడుతున్న దృశ్యాలు, చిన్నారులు పుస్తకాలు ఆరబెట్టుకుంటున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి.