*చంద్రబాబుతో కాంగ్రెస్ మాజీ సీఎం గెహ్లాట్ భేటీ
* బిజేపీయేతర కూటమి ఏర్పాటు లక్ష్యంగా చర్చలు
కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ శనివారం మధ్యాహ్నం విజయవాడకు వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మొదట విజయవాడ కాంగ్రెస్ ఆఫీసుకు చేరుకున్నారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపారు.
చంద్రబాబును కలవడానికే వచ్చా
సీఎం చంద్రబాబును కలిసేందుకే విజయవాడ వచ్చానని కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ చెప్పారు. దేశాభివృద్ధి కోసమే టీడీపీతో చేతులు కలిపామని స్పష్టం చేశారు. 2019లో బీజేపీని ఓడించేందుకే.. అన్ని రాజకీయ పార్టీలు మహాకూటమిగా ఏర్పడుతున్నాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్-టీడీపీ కలవడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే మతతత్వ పార్టీలను తరిమేయాలని పిలుపునిచ్చారు. దేశ, రాష్ట్ర రాజకీయాలపై చంద్రబాబుతో చర్చించిన తర్వాతే ఏపీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన తేదీలు ఖరారు చేస్తామని అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. సాయంత్రం ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబునాయుడు బేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని కాంగ్రెస్ నేత అశోక్‌గెహ్లాట్ ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని, రైతులు, చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలు ఎటు చూసినా తీవ్ర ఆవేదనలో ఉన్నారని చెప్పారు. ఇలాంటి దుస్థితి స్వాతంత్ర్యం వచ్చాక ఎప్పుడూ లేదన్నారు. ఆదాయం పెరిగే మార్గాలు, వ్యవస్థను నిర్మించే ఆలోచనలు వీరికి ఏమాత్రం లేవని, ఐటీ, సీబీఐ, ఈడీ అన్ని వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడి ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే కాంగ్రెస్‌తో సీఎం చంద్రబాబు కలిశారని తెలిపారు. ఆరెస్సెస్, బీజేపీలాంటి శక్తులకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని, నవంబర్ 1న రాహుల్, చంద్రబాబు సమావేశంలో చర్చించిన విషయాలపై ఎలా ముందుకు వెళ్లాలనేదిదానిపై చర్చించేందుకే వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా సేవ్ డెమోక్రసీ పేరుతో కూటమిగా ఏర్పడుతున్నామని అశోక్‌గెహ్లాట్ చెప్పారు.