రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి గెలిచే స్థానాలేవి, నిలిచే అభ్యర్థులు ఎవరు అని లెక్కలు వేసుకుని మరి అభ్యర్థులను పోటీకి నిలబెడుతున్నారు. కొన్ని నియోజకవర్గాలు సాధారణంగా ఉంటే మరికొన్ని నియోజకవర్గాలు రాష్ట్రమంతటిని తన వైపుకు తిప్పుకుంటున్నాయి. అటువంటి నియోజకవర్గం ముఖ్యమైనది గజ్వేల్ నియోజకవర్గం. ఇది కేసిఆర్ కు రెండుసార్లుగా విజయాన్ని అందించిన నియోజకవర్గం. ఒక విధంగా చెప్పాలంటే కెసిఆర్ సొంత నియోజకవర్గం. ఇప్పటికి రెండుసార్లు కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేసి అఖండ మెజారిటీతో విజయాన్ని సాధించారు. అధికారాన్ని చేపట్టారు కానీ ఈసారి కెసిఆర్ గెలుపు సునాయాసం కాదు, హోరాహోరీలా ఉంటుందని రాజకీయ విశ్లేషకులకే కాదు, సామాన్యులకు సైతం అర్థమవుతుంది.
కేసీఆర్ కి పోటీగా గజ్వేల్ లో ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఈటల రాజేందర్ ఒకప్పటి బీఆర్ఎస్ నేత. కేసిఆర్ కు శిష్యుడు. అలాంటి ఈటెల కెసిఆర్ తో విభేదించి ఇప్పుడు కేసీఆర్ పైనే పోటీ చేస్తున్నాడు. బిఆర్ఎస్ తనకు చేసిన మోసాన్ని ప్రజలకు చెబుతూ తాను పడిన కష్టాల నుంచి, రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పడుతున్న కష్టాల నుంచి విముక్తి కావాలంటే కెసిఆర్ ని గద్దె దించాలి అంటూ ఈటెల తన ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు.
బిఆర్ఎస్ నుంచి కేసీఆర్, బిజెపి నుంచి ఈటెల పోటీలో ఉండగా వీరిరువురు స్థానికేతరులంటూ, నేను లోకల్ అంటూ మాజీ ఎమ్మెల్యే తూకుంట నర్సారెడ్డి బరిలో దిగుతున్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ అవసరం ఉందంటూ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ కు అనుకూలంగా వీస్తున్న గాలిని తనకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలతో ఈసారి ఇక్కడ గెలిచేది తానేనని తూకుంట ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈటెల బిఆర్ఎస్ కి పోటీగా నిలబడిన వెంటనే బిఆర్ఎస్ లోని అసంతృప్తులు, అసమ్మతి నేతలు అందరూ బిజెపి కండవాలు కప్పుకున్నారు. ఈటెల నామినేషన్ వేయకముందే బిఆర్ఎస్ నేతలకు దడ మొదలైందని చెప్పవచ్చు. ఇక్కడ పోటీ చేసింది కేసీఆర్ అయినా గెలిపించేది మాత్రం హరీష్ రావే. అన్ని తానై ఉండి చక్రం తిప్పుతున్న కెసిఆర్ ఈసారి కచ్చితంగా కేసీఆర్ ని గెలిపించాలని వ్యూహరచన చేస్తున్నారు.
గజ్వేల్లో బిఆర్ఎస్ మొదలుపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పూర్తి అవ్వకపోవడం రింగ్ రోడ్డు పనులు మధ్యలో ఉండడం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రానివారు పార్టీపై ఆగ్రహం గా ఉండడం, సమస్య వస్తే చెప్పుకునే నాధుడే లేకపోవడంతో బిఆర్ఎస్ పై గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు గుర్రుగా ఉన్నారని చెప్పవచ్చు.
గజ్వేల్ నియోజకవర్గం లో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేస్తుంది అని సెంటిమెంట్ ప్రజలలో బాగా ఉంది. మరి ఈసారి గజ్వేల్ లో ఏ పార్టీ జెండా ఎగురుతుందో??? ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో వేచి చూడాల్సిందే!!!