అభ్యర్థుల గుణగణాలను ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలి అని.. విచక్షణతో ఓటు వేసి సరైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించారు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి… ప్రజలు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతోందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తోందని పునరుద్ఘాటించారు. తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
“1969లో 400 మంది ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చి చంపింది. వందల మందిని పొట్టన పెట్టుకుని కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. సమైఖ్య రాష్ట్రంలో నిజాం సాగర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెట్టింది. ఏడాది మొత్తం నిజాం సాగర్‌ను నిండుగా ఉంచే బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని బీఆర్ఎస్ శ్రమించింది. వ్యవసాయ స్థిరీకరణ కోసం సాగునీటిపన్ను రద్దు చేశాం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.