దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాల వల్ల పలు రాష్ట్రాల్లో ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే జరిగింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు ప్రభావం తీవ్రంగా ఉంది. గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణలపై వరద భీబత్సం సృష్టిస్తుంది. వర్షాల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇళ్ళల్లోకి వరద వస్తుంది. రోడ్లు కాస్త చెరువులు అయ్యాయి. హైదరాబాద్ మాత్రమే కాదు..తెలంగాణ మొత్తం వరుణుడు ప్రభావం ఉంది. ప్రాజెక్టులు నిండు కుండల మాదిరిగా ఉన్నాయి. చెరువులు మునిగాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలతో జనజీవనం స్తంభించింది.
ఇప్పటికే తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆదివారం వరకు సెలవులు పొడిగించారు. ఇక భారీ వరద వల్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచ వాగు పొంగి పొర్లడంతో పక్కనే ఉన్న మోరంచపల్లి గ్రామంలోకి వరద భారీగా వచ్చి ఇళ్ళు నీట మునిగాయి. దీంతో ప్రజలు ఇళ్ల శ్లాబ్‌లు పైకి ఎక్కారు. దీంతో సిఎం కేసిఆర్..వెంటనే అక్కడకి హెలికాప్టర్‌లు పంపించి..గ్రామ ప్రజలని కాపాడాలని సూచించారు. దీంతో అక్కడకు సైనిక హెలికాప్టర్లు వెళ్ళాయి.
పలు చోట్ల వరదల్లో పలువురు గల్లంతయ్యారు. ప్రాణాలు కోల్పోయారు. కొన్ని గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఇంకా వర్ష సూచన ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తుంది. అలాగే వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవాలని, వారికి తక్షణమే రూ.10 వేల సాయం చేయాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..ప్రభుత్వాన్ని కోరారు.
ఇక తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా వరద బీభత్సం సృష్టిస్తుంది. తీవ్రంగా పంట నష్టం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్థంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇంకా ఏపీకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని 10 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరితో పాటు ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. మరో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే భారీ వర్షాలు పడుతున్న జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మొత్తానికి వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలని ముంచెత్తాయి.