కేటీఆర్ మిస్సింగ్: కాలనీల వాసుల కడుపు మంటకు కొత్త రూపం!

-

హైదరాబాద్ లోని కొన్ని కాలనీల వాసులు తమ కడుపు మంటకు కొత్త రూపం ఇచ్చారు. సహనం నశించిన కొందరు ప్రజలు.. కేటీఆర్ ఫొటోతో పెద్ద పెద్ద పోస్టర్లను ముద్రించి.. “కేటీఆర్ కనిపించడం లేదు”  అనే టైటిల్ తో పోస్టర్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ఈ పోస్టర్లలో.. మంత్రి కేటీఆర్ తన విధులను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఆయన ఎక్కడైనా కనిపించారా? అంటూ.. ప్రశ్నలు గుప్పించారు. ప్రస్తుతం తెలంగాణలో ఇదే హాట్ టాపిక్!

అవును… “కేటీఆర్ కనిపించడం లేదు.. మీరేమైనా చూశారా?” అంటూ పోస్టర్లు హైదరాబాద్ లో వెలిశాయి. ఎక్కడ చూసినా.. ఇవే కనిపిస్తున్నాయి. తెలంగాణ మంత్రి అధికార పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు.. కేటీఆర్ ను కార్నర్ చేస్తూ.. వెలిసిన ఈ పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం.. గులాబ్ తుఫాన్!

తాజాగా వచ్చిన గులాబ్ తుఫాన్ తో హైదరాబాద్ చివురుటాకులా ఒణికి పోయింది. తీవ్ర బాధిత ప్రాంతంగా నిలిచింది. ఎటు చూసినా.. మోకాల్లోతు నీరు దర్శన మిచ్చింది. సాధారణ ప్రజలకు చుక్కలు చూపించింది. కాలనీలకు కాలనీలే నీటమునిగాయి. గంటలు కాదు.. రోజుల తరబడి ప్రజలు నీటిలోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు రోజుల పాటు ఏకధాటిగా కురిసన వర్షాలతో ప్రజలు అల్లాడిపోయారు. ఒకవైపు వరదలు, మరోవైపు వర్షాలతో ఇళ్లు మునిగి… ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డాలు.

మరి ఈ సమయంలో ప్రజలను ఆదుకునేందుకు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్.. ఎక్కడ ఉన్నారు? ఏమిచేస్తున్నారు? ఎంతమందికి ఆపన్న హస్తం అందించారు? ఇదే విషయం ఇప్పుడు ప్రజల నుంచి తీవ్ర విమర్శల రూపంలో చుట్టుముడుతోంది. కనీసం.. ఒక్కటంటే ఒక్క ఏరియాకు కూడా కేటీఆర్ రాలేదని.. తాము తిన్నామా? ఉన్నామా? అని కూడా పట్టించుకోలేదని.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భాగ్యనగర వాసులు! దాని ఫలితమే… “కేటీఆర్ కనిపించడం లేదు.. మీరేమైనా చూశారా?” మరి దీనిపై అధికార పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Exit mobile version