కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అదేసమయంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే, కరోనా నేపథ్యంలో పేదలకు వెసులుబాటు కల్పించేందుకు జగన్ ప్రభుత్వం పింఛన్లు, కరోనా సహాయం కింద రూ.1000 పంపిణీ ప్రారంభించింది. ముందుగా నిర్ణయించిన మేరకు ఏప్రిల్ 1న పింఛన్లు, 4వ తేదీన కరోనా సాయం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ జరిగింది. అయితే, ఈ వ్యవహారం సాఫీగా సాగిపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ, ఈ వ్యవహారంలోకి వైసీపీ నాయకులు వేలు పెట్టారు. ఇదే ఇప్పుడు రాజకీయ దుమారం రేపింది.
ఈ వ్యవహారంలో స్తానిక సంస్థల్లో పోటీ చేస్తున్న నాయకులు కూడా ఉండడంతో అధికార పార్టీపై విమర్శలు జోరందుకున్నాయి. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఇంటింటికీ వెళ్లి వెయ్యి అందించారు. ఆయన వెంట కార్యకర్తలు, అధికారులు గుంపులు గుంపులుగా నడిచారు. కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ రెడ్డి గ్రామసభ తరహాలో భేటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ సహాయం అందించారు. ప్రొద్దుటూరులో వైసీపీ నేతలే రూ.వెయ్యి పంపిణీ చేసి… స్థానిక ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని ప్రచారం చేశారు. అనంతపురం జిల్లాలో వెయ్యి రూపాయల పంపిణీలో అధికార పార్టీ నేతలు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల బరిలో నిలిచిన వారంతా ఎక్కడికక్కడ వలంటీర్లతో సహా ఇంటింటికీ తిరిగారు. వలంటీర్ నామమాత్రంగా పక్కన నిల బడగా… అభ్యర్థులే రూ.వెయ్యిని కార్డుదారు చేతిలో పెట్టి, ఎన్నికలో తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వలంటీర్లకంటే ముందుగా వైసీపీ స్థానిక అభ్యర్థులు వీధుల్లోకి వచ్చారు. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా.. కూడా ఇలా సామాజిక పింఛన్లు, సహాయ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలను రంగంలోకి దింపడం సహజమే. గతంలో టీడీపీ కూడా పసుపు-కుంకుమ కింద నగదును బ్యాంకుల్లో జమ చేసిన ప్పుడు కూడా తమ్ముళ్లంతా వీధుల్లోకి వచ్చి హడావుడి చేశారు. అయితే, అప్పటికి పరిస్థితులు తేడాగా ఉన్నాయి.
ఇప్పుడు కరోనానేపథ్యంలో ప్రభుత్వమే ప్రజలను బయటకు రాకుండా ఆంక్షలు విధించినప్పుడు ప్రజాప్రతినిధులు, స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారు ఇలా బయటకు వచ్చి పింఛన్లు, సాయాలు పంచడం ఏమిటనేది విమర్శకుల మాట. ప్రభుత్వం ఎలాగూ వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు వారికే వదిలేసి ఉంటే పరిస్థితి బాగుండేదని అంటున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎంత చేస్తున్నా.. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల కారణంగా అభాసుపాలవుతోందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తుండడం గమనార్హం. మరి ఈ విషయంలో జగన్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బెటరనే సూచనలు వినిపిస్తున్నాయి.