పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి జడ్పీటీసీని టీడీపీ తృటిలో చేజార్చుకుంది. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఇదే చర్చనీ యాంశంగా మారింది. ఎన్నో ఆశలు పెట్టుకుని మరీ ఇక్కడ నామినేషన్ వేసినప్పటికీ.. జడ్పీటీసీగా పోటీకి నిలిచిన మహిళ చేసిన ఓ చిన్న పొరపాటు.. దీనిని పట్టించుకోని పార్టీ సీనియర్ల కారణంగా టీడీపీ కీలకమైన స్థానాన్ని చేజార్చుకున్నట్టయింది. అదేవిధంగా ఉంగుటూరు నియోజకవర్గంలోని నిడమర్రు మండల జడ్పీటీసీ స్థానం కూడా చిన్న పొరపాటు కారణంగా ఇక్కడ కూడా టీడీపీ ఛాన్స్ మిస్ చేసు కుంది. దీంతో ఇప్పుడు పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ముందే మేల్కొని ఉంటే బలమైన స్థానాల్లో టీడీపీ దిగ్విజయంగా విజయం సాథించేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని నిడమర్రు జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ తరపున దాఖలైన నామినేషన్ తిరస్కరించారు. అలాగే చింతలపూడి జడ్పీటీసీ స్థానానికి దాఖలైన మరో నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. జిల్లా వ్యాప్తంగా 48 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, వీటిలో వైసీపీ, టీడీపీ మధ్య భారీ పోటీ నెలకొంది. చింతలపూడి జడ్పీటీసీ స్థానా నికి టీడీపీ నుంచి లలిత కుమారి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ముగ్గురు సంతానం కలిగి ఉన్నారనే అభియోగంపై లలితకుమారి నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో కీలకమైన స్థానానికి టీడీపీ పోటీ చేయ కుండా వెనుతిరిగినట్టు అయ్యింది.
అదేవిధంగా మరో కీలకమైన నిడమర్రు మండల జడ్పీటీసీ స్థానానికి రామ్మూర్తి నామినేషన్ దాఖలు చేశారు.అయితే ఆయన ఇంతకుముందే స్థానిక సాగునీటి సంఘానికి బాధ్యులుగా ఉన్నారు. ఆ పదవికి రాజీనామా సమర్పించాల్సి ఉంది. ఆయన రాజీ నామా చేశారు గాని రాజీనామా పత్రాన్ని జోడించకపోవడంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇప్పటికే నువ్వానేనా అన్నట్టుగా వైసీపీ, టీడీపీ మధ్య పోటీ ఉండగా ఏకంగా రెండు జడ్పీటీసీ స్థానాలను టీడీపీ తొలి పోరులోనే చేజార్చుకోవాల్సి వచ్చిందని నాయకులు తలలు పట్టుకున్నారు. ఇదిలావుంటే, ఈ రెండు స్థానాల్లోనూ టీడీపీ శ్రేణుల బలంగా ఉండడం, టీడీపీ సీనియర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ ప్రచారం చేయడం నేపథ్యంలో ఇలా జరగడంపై నాయకులు తల్లడిల్లుతున్నారు.