అటు రాజయ్య..ఇటు ముత్తిరెడ్డి..ఇద్దరు అవుట్?

-

ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే బి‌ఆర్‌ఎస్ పార్టీ కంచుకోట. ఉద్యమ కాలం నుంచి ఓరుగల్లులో కారు జోరు కొనసాగుతుంది. ఇక గత రెండు ఎన్నికల్లో కూడా బి‌ఆర్‌ఎస్ హవా నడిచింది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 12 సీట్లు ఉంటే బి‌ఆర్‌ఎస్ 10 సీట్లు, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకుంది. భూపాలపల్లి, ములుగు సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది.మిగిలిన సీట్లు కారు ఖాతాలో పడ్డాయి.

అయితే తర్వాత భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి బి‌ఆర్‌ఎస్ లో చేరారు. దీంతో బి‌ఆర్‌ఎస్ బలం 11కు చేరుకుంది. ఇలా జిల్లాలో బి‌ఆర్‌ఎస్‌కు 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఈ సారి ఎన్నికల్లో 11 మందికి సీట్లు ఇస్తున్నారా? అంటే డౌటే అని విశ్లేషకులు అంటున్నారు. ఈ సారి అక్కడ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇవ్వడానికి కే‌సిఆర్ రెడీ అవుతున్నారట. అది కూడా సీనియర్ ఎమ్మెల్యేలైన తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలని పక్కన పెట్టాలని కే‌సి‌ఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం.

తాజాగా అభ్యర్ధుల లిస్ట్ ప్రిపేర్ చేసే క్రమంలో వారికి సీట్లు ఇవ్వకూడదని కే‌సి‌ఆర్ డిసైడ్ అయ్యారని బి‌ఆర్‌ఎస్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఎందుకంటే వీరిపై ప్రజా వ్యతిరేకతతో పాటు సొంత పార్టీ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే  జనగామలో ఈసారి తమ ఎమ్మెల్యేకు టికెట్‌ ఇవ్వవద్దని అక్కడ పార్టీ శ్రేణులు  అధిష్ఠానాన్ని కోరాయి. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సీటు ఇవ్వాలని అంటున్నాయి. ఇప్పుడు కే‌సి‌ఆర్ ఆ దిశగానే కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఇటు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నారో చెప్పాల్సిన పని లేదు. ఈయనకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి పడటం లేదు. ఈ క్రమంలోనే ఈ సారి రాజయ్యని పక్కన పెట్టి కడియంకు గాని, ఆయన కుమార్తెకు గాని సీటు ఇచ్చేలా కే‌సి‌ఆర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి రాజయ్య, ముత్తిరెడ్డికి ఈ సారి షాక్ తగిలేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news