క‌ల్కి ఆశ్ర‌మంలో ఐటీ దాడులు… మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు

చిత్తూరు జిల్లా వరదయ్య పాళెంలోని కల్కి ఆశ్రమమైన ఏకం ఆలయంలో ఐటీ శాఖ దాడులు మూడో రోజు కొనసాగుతున్నాయి. తమిళనాడు ఐటీ శాఖ అధికారులు ఈ సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే రెండు రోజులుగా కొన‌సాగుతోన్న దాడుల్లో ఎన్నో విస్తుపోయే నిజాలు బ‌య‌ట‌కు రాగా ఇప్పుడు మ‌రిన్ని మ‌తిపోయే నిజాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా ఆశ్ర‌మంలో న‌గ‌దు దాచే ఓ కీల‌క ప్రాంతాన్ని ఐటీ అధికారులు గుర్తించిన‌ట్టు తెలుస్తోంది. ఇక్కడ న‌గ‌దు గుట్ట‌లు గుట్ట‌లుగా ల‌భ్య‌మైన‌ట్టు స‌మాచారం.


ఇక్కడ సీక్రెట్‌గా ఉన్న ఓ ప్రాంతంలో భారీగా బంగారు బిస్కెట్లు, సుమారు రు. 10 కోట్ల వరకు స్వదేశీ విదేశీ నగదు దొరికినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారులు ఏమీ చెప్పడం లేదు. త‌మిళ‌నాడు ఐటీ అధికారులు ఏకం ఆలయంలో, వసతి గృహాలలో మకాం వేసి వాటిని పూర్తిగా త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆల‌యం ప్రాంగణం నుంచి ఏ ఒక్క‌రిని బ‌య‌ట‌కు కూడా వెళ్లనీయడం లేదు. బయటి వారిని కూడా లోపలికి అనుమతించక ఆశ్రమాన్ని దిగ్భందించారు.

కల్కి భగవాన్ కొడుకు కృష్ణ నాయుడు, కోడలు ప్రితి నాయుడులను… ట్రస్ట్ నిర్వాహకుడు లోకేష్ దాసాజీల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆశ్రమ నిర్వాహకులు.. దాసాజీల‌ను అధికారులు వేర్వేరుగా విచారిస్తున్నారు. స్వదేశీ… విదేశీ భక్తులు ద్వారా భారీగా విరాళాలు సేకరించి… ఆ డబ్బుతో వందల ఎకరాలు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే కల్కి భగవాన్ దంప‌తులు అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే.

గత 25 ఏళ్లలో ట్రస్టు పేర్లను తరచు మారుస్తుండటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించినట్లు తెలిసింది. ట్రస్టు పేరిట వచ్చిన నిదులు, వాటితో ఏఏ ఆస్తులు ఆర్జించారు..? నిధులు దేనికి మళ్లించారు. ఎక్కడెకక్కడ భూములున్నాయనే విషయమై ఆరా తీసారు. పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.