ఏపీ కేబినెట్ లో మార్పులు,చేర్పుల పై మొదలైన లెక్కలు

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్పడి వ‌చ్చే నెలకి రెండేళ్లు పూర్త‌వుతుంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు అంద‌రి దృష్టి కేబినేట్ విస్త‌ర‌ణపైనే ఉంది. ప్ర‌భుత్వం ఏర్పడిన రెండున్నరేళ్ల త‌రువాత మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పడంతో ఇప్పటినుంచే ఆశావాహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. మంత్రిపదవులపై కర్చీఫ్ వేసేందుకు కొందరు సీనియర్లు సీరియస్ గా ట్రై చేస్తున్నారు. ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే కొందరు మంత్రిపదవులు దక్కించుకోగా.. పదవి వచ్చిందని దాదాపు ఫిక్సైపోయిన నేతలకు మాత్రం ఆ ఛాన్స్ దక్కలేదు. దీంతో త్వరలో జ‌ర‌గ‌బోయే మార్పులు, చేర్పుల్లో భాగంగా మంత్రివర్గంలో చోటు ద‌క్కించుకోవ‌డం కోసం వారు ఇప్పటి నుంచే సీరియస్ ప్రయత్నాల్లో ఉన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఏర్పాడ్డాక మొదటి మంత్రివర్గంలో రోజా, భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, అంబటి రాంబాబు లాంటి నేతలు మంత్రిపదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. అవకాశం దక్కని సీనియర్ నేతలు రెండున్నరేళ్ల తర్వాత అవకాశం వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. జమిలీ ఎన్నికల పై కూడా చర్చ నడుస్తున్న సమయలో మంత్రి వర్గంలో మార్పులు.. చాన్స్ దక్కించుకునే నేతలే ఎన్నికల్లో జగన్ టీంగా పని చేయనున్నారు. గుంటూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హోం మంత్రి సుచరితను తప్పించి కొత్తగా ఇద్దరికి చాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,అంబటి రాంబాబుకు చాన్స్ దక్కే అవకాశం ఉంది.

పశ్చిమగోదావరి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తప్పించి కొత్తవారికి చాన్స్ ఇచ్చే అవాకాశం ఉంది. తానేటి వనిత,శ్రీరంఘనాధరాజు పనితీరుపట్ల జగన్ కూడా సంతృప్తిగా లేనట్లు తెలుస్తుంది.ఎలాంటి అంచనాలు లేకుండా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కర్నూలు జిల్లాకి చెందిన గుమ్మనూరు జయరాం,అనంతపురం జిల్లాకి చెందిన శంకరణ నారాయణ స్థానంలో కొత్త వారికి చాన్స్ దక్కనుంది. శ్రీకాకుళం జిల్లాకి చెందిన ధర్మనకృష్ణదాస్ స్థానంలో అతని సోదరుడు ప్రసాదరావు, చిత్తూరు జిల్లాకి చెందిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్థానంలో మరో దళిత నేతకు చాన్స్ దక్కనుంది. కృష్ణా జిల్లాకి చెందిన మంత్రులు వెల్లంపల్లి,పేర్ని నాని స్థానంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను లేదా పార్ధసారధికి చోటు దక్కనుంది. ఇదే జిల్లా నుంచి మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్నవారిలో పెడన ఎమ్మెల్యే జోగి ర‌మేష్ కూడా ఉన్నారు.