తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కెసిఆర్, వైఎస్ జగన్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. సోమవారం సమావేశమైన ఇరువురు ముఖ్యమంత్రులు, షెడ్యులు 9, 10 ఆస్తుల విషయంలో వేగంగా సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కృష్ణా ఆయకట్టుకి గోదావరి నీటిని ఏ విధంగా తరలించాలి అనే దానిపై ఇరువురు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.
గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకి అందించాలి అని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రులు, గోదావరి నీటిని ఎక్కడి నుంచి తరలించాలి అనే దానిపై మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్ ని వినియోగించుకుంటూనే గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. దీని వలన తక్కువ సమయం,
తక్కువ ఖర్చుతో నీటిని తరలించడానికి ఆస్కారం ఉంటుందని భావిస్తున్న జగన్ కెసిఆర్ దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకి వెళ్ళాలని, జగన్, కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక తాజా రాజకీయ పరిణామాలు, మూడు రాజధానుల అంశం సహా పలు కీలక విషయాల్లో ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. పౌరసత్వ సవరణ చట్టంపై ఒకే మాట మీద ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.