ఏపీ రాజకీయాల్లో సిఎం జగన్ మరోసారి రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారు. మూడేళ్ళ నుంచి విశాఖకు పరిపాలన రాజధాని తీసుకొస్తామని చెబుతున్న జగన్..గత కొన్ని రోజుల నుంచి సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడతానని చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా విశాఖ పర్యటనకు వెళ్ళి..అక్కడ కొన్ని పనులకు శంఖుస్థాపనలు చేసిన జగన్..సెప్టెంబర్ లో మీ బిడ్డ విశాఖలో కాపురం పెడుతున్నాడని మాట్లాడారు.
పాలనా వికేంద్రీకరణలో భాగంగా మీ బిడ్డ కాపురం ఉండబోయేది కూడా విశాఖలోనే అని చెప్పడానికి సంతోషిస్తున్నట్లు జగన్ వెల్లడించారు. మీ బిడ్డ పాలనలో కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడటం లేదని, చివరికి తమకు ఓటు వేశారో లేదా అనేది కూడా చూడటం లేదన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 2.10 లక్షల కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి మీ ఖాతాల్లో వేశామన్నారు. మీ అన్న పాలనలో పథకాలు అంది ఉంటేనే, మంచి జరిగి ఉంటేనే, చంద్రబాబు పాలన కంటే మీకు మంచి జరిగిందని భావిస్తేనే తనని ఆశీర్వదించాలని జగన్ కోరారు. అంటే జగన్ పక్కా సెంటిమెంట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ఇక జగన్ ప్రభుత్వం అమరావతిలో భూముల్లో అక్రమాలు జరిగాయని గతంలోనే సిట్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై హైకోర్టులో స్టే వచ్చింది. దీనిపై సుప్రీంకు వెళ్ళడంతో..తాజాగా హైకోర్టు విధించిన స్టేని సుప్రీం ఎత్తేసింది. సిట్ విచారణ చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది.
దీంతో చంద్రబాబు చేసిన అక్రమాలు బయటపెడతామని, అమరావతి భూముల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చేశారని, అవన్నీ నిగ్గు తేల్చి..త్వరలోనే చంద్రబాబుని జైలుకు పంపిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. బాబు అరెస్ట్ అవ్వడం ఖాయమని అంటున్నారు.