రాజ్యసభకు కవిత! కేటీఆర్‌కు లైన్ క్లియర్ కోసమేనా?

-

స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. సిట్టింగ్ అభ్యర్థులకే మళ్లీ అవకాశం కల్పిచనున్నారు. నిజామాబాద్ అభ్యర్థిని మాత్రం సోమవారం ప్రకటించే అవకాశం ఉన్నది. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అభ్యర్థిత్వాన్ని సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్టు తెలుస్తున్నది. కల్వకుంట్ల కవితను రాజ్యసభకు పంపనున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో కే తారకరామారావుకు లైన్ క్లియర్ చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

కల్వకుంట్ల కవితను సీఎం కే చంద్రశేఖర్‌రావు మొదటి నుంచీ రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంచుతూ వస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఆమెను ఎంపీ‌గా పోటీ చేయించారు. నిజామాబాద్ నుంచి పోటీ చేసిన కవిత లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019, సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఏడాది కాలం ఏ పదవీ లేకుండా ఉన్న కవితను రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకురాక తప్పలేదు. ఓటమి పాలైన నిజామాబాద్ నుంచే ఆమెను మండలికి ఎంపిక చేశారు.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఉంటాయి. ఈటల రాజేందర్ భర్తరఫ్‌తో మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీ అయింది. ఒకవేళ కల్వకుంట్ల కవితకు మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే క్యాబినెట్‌లోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రంలో మరో పవర్ సెంటర్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కేటీఆర్, కవిత‌ కేంద్రంగా రాజకీయాలు మారే పరిస్థితి తలెత్తుతుంది. ఇదంతా ఊహించిన కేసీఆర్ వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేశారు.

రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ పదవీ కాలం మరో రెండేండ్లు ఉన్నది. కానీ, ఆయన్ని అనూహ్యంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ వేయించారు. సోమవారం బండ ప్రకాశ్ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. వెంటనే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. బండ ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయ్యే స్థానంలో కవితను ఎగువ సభకు పంపే అవకాశం స్పష్టంగా ఉన్నది.

నిజామాబాద్ ఎంపీ‌గా ఓటమి పాలైన కవిత జిల్లాను మాత్రం విస్మరించలేదు. అక్కడి నాయకులతో టచ్‌లో ఉంటూ వస్తున్నారు. మళ్లీ అక్కడి నుంచే ఎంపీగా పోటీ చేసే అవకాశం కూడా ఉన్నది. అయితే, సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేండ్ల సమయం ఉన్నది. బండ ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయ్యే రాజ్యసభ సభ్యుడి పదవీ కాలం కూడా అంతే ఉన్నది. ఈ నేపథ్యంలో కవితను రాజ్యసభకు పంపడానికి నిర్ణయం తీసుకున్నారు. రెండేండ్ల పదవీకాలం సార్వత్రిక ఎన్నికల బరిలో నిజామాబాద్ నుంచే పోటీ చేసే అవకాశం ఉన్నది.

ఏదిఏమైనా టీఆర్‌ఎస్ భవిషత్యు సీఎం కేటీఆరే. ఆయనకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఈటల రాజేందర్‌కు గులాబీ బాస్ చెక్ పెట్టారని రాజకీయ వర్గాల అభిప్రాయం. హరీశ్‌రావు కూడా టీఆర్‌ఎస్ అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితిలో ఎమ్మెల్సీగా కవిత కొనసాగితే ఆమె మద్దతుదారుల నుంచి కొత్త డిమాండ్లు పుట్టుకు వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ రాజ్యసభ ఎత్తుగడ వేశారనే చర్చ జరుగుతున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version