కడప ఎంపీ అవినాష్ రెడ్డి అలకపాన్పు ఎక్కారా? పార్టీ అధికారంలో ఉన్న పదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. కడప ఎంపీ స్థానం వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. ఇక్కడ నుంచి ఎవరు బరిలో ఉన్న విజయం వైఎస్ ఫ్యామిలీదే. అందుకే 2014లో వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక 2019లో కూడా అవినాష్ మీద నమ్మకంతో జగన్ మరోసారి టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూడా అవినాష్ ఘనవిజయం సాధించారు.
అటు పార్టీ కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దీంతో అవినాష్ ఏదో ఒక పదవి దక్కుతుందని ఆశించారు. కానీ అలాంటి పదవులేమీ అవినాష్ కి దక్కలేదు. దీంతో అవినాష్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. పైగా తన సహచరుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి లోక్ సభ పార్లమెంటరీ నేత పదవి ఇచ్చారు. అలాగే మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి రాష్ట్ర కేబినెట్ లో ఉన్నారు. ఇలా కుటుంబంలో ఒక పదవి ఉండగానే మళ్ళీ మిథున్ రెడ్డికి పదవి ఇవ్వడంతో అవినాష్ అలకపాన్పు ఎక్కినట్లు తెలుస్తోంది.
పైగా జగన్ కూడా అవినాష్ ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. దీంతో అవినాష్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. కేడర్ ని నడిపించడంలోనూ అవినాష్ ముందుకు రావడం లేదు. పోనీ పార్టీ తరుపున ఏదైనా కార్యక్రమానికి పిలుపోచ్చిన ఏదొక పని చెప్పి తప్పించుకుంటున్నారు. అటు కడపలో నీరు లేక గగ్గోలు పెడుతున్న రైతులని కూడా అవినాష్ పట్టించుకోవట్లేదట. ఎంపీ కాబట్టి సమస్యలు చెప్పుకుందామన్న కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదట.
ఇక అవినాష్ ఇలా అలకపాన్పు ఎక్కడం వల్ల వంద రోజుల పాలనలో పూర్తిగా విఫలమైనట్లు తెలుస్తోంది. మొత్తం మీద కడప పార్లమెంట్ పరిధిలో అవినాష్ పనితీరు ఏం బాగోలేదనే చెప్పాలి. మరి అవినాష్ ని అలకపాన్పు నుంచి దించటానికి పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.