కేసీఆర్ టాక్స్ : కొత్త పార్టీ వ‌స్తే దేశం మారుతుందా ?

-

చీక‌ట్లు లేని రాష్ట్రం.. అభివృద్ధి అనే వెలుగు మాత్రమే కావాలి అని అనుకున్న రాష్ట్రం. అదే దిశ‌గా పాల‌కులు ప‌రిత‌పిస్తే మ‌రిన్ని మంచి ఫ‌లాలు సాధించే అవ‌కాశాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ. దేశంలో తెలంగాణతో పాటు ఇవాళ ఎన్నో రాష్ట్రాలున్నాయి. కానీ ఉద్య‌మాల నుంచి ఉద్య‌మాల వ‌ర‌కూ ఇవాళ్టికీ పోరాటంచేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మే అన్న‌ది సుస్ప‌ష్టం. అందుకే తెలంగాణ ఉద్య‌మ రీతుల ద‌గ్గ‌ర నుంచి ఇప్ప‌టిదాకా కేసీఆర్ ఎన్నో సార్లు ఎన్నో మాట‌లను ఆక‌ర్ష‌ణ మంత్రంగా మార్చి చెప్పారు. ఎన్నో ప‌థ‌కాలను జ‌నాక‌ర్ష‌క రీతికి ద‌గ్గ‌ర చేశారు.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆవిర్భావ వేళ రెండు ద‌శాబ్దాల‌కు పైగా కృషి చేసిన కేసీఆర్ ఇక‌పై మ‌రిన్ని మంచి ప‌నులు చేయాల‌ని ఆశిద్దాం. రానున్న ఎన్నిక‌లలో కొత్త వ్యూహాలు అమలు చేసేందుకు సిద్ధం అవుతున్న కేసీఆర్ త్వ‌ర‌లోనే జాతీయ స్థాయిలో తిరుగులేని రాజ‌కీయ శ‌క్తిగా అవ‌త‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర స‌మితి ఉంటూనే మ‌రో కొత్త పార్టీ పుట్టుక‌ను సాధ్యం చేయ‌నున్నారు కేసీఆర్. కొత్త పార్టీ వ‌స్తే ఆంధ్రాలో కూడా పోటీ చేస్తుందా ? ఏమో గుర్రం ఎగ‌రావ‌చ్చు.

ఇవాళ ప్లీన‌రీ వేడుక‌ల్లో కేసీఆర్ చాలా మాట‌లు చెప్పారు. దేశాన్ని న‌డిపే శ‌క్తి త‌న‌లో ఉంద‌న్న విశ్వాసం ఒక‌టి ప్ర‌క‌టించారు. బీజేపీని ఉద్దేశించి పెద్ద‌గా ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌లేదు. కానీ దేశం మాత్రం వ‌నరుల వినియోగంలో విఫ‌లం అవుతుంద‌ని మాత్రం వెల్ల‌డించి మ‌రో కొత్త వివాదాన్ని తెచ్చారు. ఏ విధంగా చూసినా తెలంగాణ దేశంలోనే నంబ‌ర్ ఒన్ అని చెప్పారు. విద్యుత్ క‌ష్టాలు లేని రాష్ట్రం, ఉపాధి అవ‌కాశాల‌కు క‌ల్ప‌త‌రువుగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని ప‌దే ప‌దే చెప్పారు. అందుకే తాము వ‌చ్చాక బంగారు తెలంగాణ సాధ్యం అయింద‌ని, స‌మైక్య పాల‌కుల నుంచి ఇప్ప‌టిదాకా మార్పు ఉంద‌ని, వాళ్లు సాధించ‌లేనివి కూడా తాను సాధించాన‌ని చెప్పారాయన.

కొత్త పార్టీ వ‌స్తే దేశం మారిపోతుందా ? అదేవిధంగా ఉన్న పార్టీల‌కు అది ప్ర‌త్యామ్నాయం అవుతుందా ? ఎప్ప‌టి నుంచో కూట‌మి ఏర్పాటుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న కేసీఆర్ ఇప్పుడొక కొత్త అవ‌కాశం దొరికింది. ఆ విధంగా ఆయ‌న త‌న రాజ‌కీయ చ‌ద‌రంగాన్ని పూర్తిగా మార్చి ఆడ‌నున్నారు. ఆ విధంగా ఆయ‌న రాష్ట్ర పాల‌న నుంచి దేశ పాల‌న వ‌ర‌కూ అన్నింటిపైనే అంతో ఇంతో శ్ర‌ద్ధ పెడుతున్నారు. అందుకే టీఆర్ఎస్ ను కొట్టే వాడు లేడ‌ని, తాము అనుకుంటే దేశ రాజ‌కీయాల‌ను సైతం ప్ర‌భావితం చేయ‌గ‌ల‌మ‌ని ప‌దే ప‌దే అంటున్నారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news