తెలంగాణ సీఎం మ‌ళ్లీ కేసీఆరే అవుతారు.. కేంద్ర మంత్రి జోస్యం..!

-

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం ముంద‌స్తు ఎన్నికల వేడి నెల‌కొని ఉంది. అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌తోపాటు ప్ర‌తిప‌క్ష పార్టీలు అన్ని కూడా ముంద‌స్తు ఎన్నిక‌ల కోసం సిద్ధ‌మవుతూనే ఉన్నాయి. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి తెలంగాణ‌లో ఒంట‌రిగానే పోటీ చేయాల‌ని భావిస్తోంది. అందులో భాగంగానే వ‌చ్చే వారంలో ఆ పార్టీ అధినేత అమిత్ షా తెలంగాణలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఎన్నిక‌ల్లో గెలిచే అభ్య‌ర్థుల‌కు టిక్కెట్ల‌ను ఇచ్చే అంశాన్ని ప‌రిశీలించ‌డంతోపాటు, ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం అవ‌డం కోసం పార్టీ శ్రేణుల‌కు దిశా నిర్దేశం కూడా చేయ‌నున్న‌ట్లు తెలిసింది.

అయితే తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు బీజేపీ ఒంట‌రి పోరు చేసేందుకు సిద్ధ‌మ‌వుతుంటే.. మ‌రో వైపు ఆ పార్టీ నేత ఒక‌రు చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. అస‌లు విష‌యం ఏమిటంటే… కేంద్ర మంత్రి రాందాస్ అథ‌వాలే తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. అందులో భాగంగానే ఆయ‌న ఇవాళ కామారెడ్డిలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా రాందాస్ అథ‌వాలే మాట్లాడుతూ… తెలంగాణ‌లో రానున్న ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీనే మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, సీఎం గా కేసీఆర్ మ‌ళ్లీ ప్ర‌మాణం చేస్తార‌ని రాష్ట్ర బీజేపీ శ్రేణుల‌కు షాక్ ఇచ్చినంత ప‌ని చేశారు.

అంతేకాకుండా.. తెలంగాణ అభివృద్ధికి ప్ర‌ధాని మోదీ కృషి చేస్తున్నార‌ని రాందాస్ అన్నారు. రానున్న ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ గెల‌వ‌డంతోపాటు సీఎంగా కేసీఆర్ మ‌రోసారి ప‌గ్గాలు అందుకుంటార‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. దీంతో ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేత‌ల‌కు రాందాస్ వ్యాఖ్య‌లు మింగుడు ప‌డ‌డం లేదు. ఓ వైపు రాష్ట్రంలో ఒంట‌రి పోరుకు సిద్ధ‌మ‌వుతుంటే.. త‌మ పార్టీకి చెందిన నేత‌నే ఇలా మాట్లాడడం స‌రికాద‌ని ప‌లువురు బీజేపీ నేత‌లు గుస గుస‌లాడుకుంటున్నట్లు తెలిసింది..!

Read more RELATED
Recommended to you

Latest news