ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా నాలుగో టెస్టులో ఓటమి పాలైన విషయం విదితమే. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను ఇప్పటికే భారత్ 1-3 తో చేజార్చుకుంది. జట్టులో కేవలం కోహ్లి తప్ప ఏ ఆటగాడూ ఇప్పటి వరకు ఆడిన నాలుగు టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరచలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం అందరూ టీమిండియా ప్లేయర్లతోపాటు కోచ్ రవిశాస్త్రిని కూడా విమర్శిస్తున్నారు. అలాంటి వారి జాబితాలో దాదా కూడా చేరిపోయాడు.
ఇంగ్లండ్ సిరీస్ ఓటమికి కోచ్ రవిశాస్త్రి బాధ్యత వహించాలని టీమిండియా మాజీ కెప్టెన్, దాదా సౌరవ్ గంగూలీ అన్నాడు. జట్టులో కేవలం కోహ్లి తప్ప మిగతా ఎవరూ సరిగ్గా ఆడడం లేదని, అలాంటప్పుడు కోచ్ ఏం చేస్తున్నారని దాదా ప్రశ్నించాడు. ప్రస్తుతం బ్యాటింగ్ లైనప్ బాగా లేదని, బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడం లేదని మండిపడ్డాడు.
2011 నుంచి టీమిండియా విదేశ ప్రదర్శనలను గమనిస్తే చాలా సిరీస్‌లను ఇండియా కోల్పోయిందని, బ్యాట్స్‌మెన్‌లలో సత్తా తగ్గిందని గంగూలీ అన్నాడు. టీమిండియా బ్యాటింగ్ లైనప్ వైఫల్యం చెందడానికి కోచ్ రవి శాస్త్రే కారణమని, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కూడా బాధ్యత వహించాలని గంగూలీ తెలిపాడు. బ్యాటింగ్ లైనప్ సరిగ్గా లేనంత కాలం టీమిండియా విదేశీ పర్యటనల్లో ఇలాగే సిరీస్‌లలో ఓడిపోవాల్సి వస్తుందని దాదా వ్యాఖ్యానించాడు. కాగా ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు ఈ నెల 7వ తేదీన లండన్ లోని ఓవల్‌లో ప్రారంభం అవుతుంది.