కోమటిరెడ్డికి అంత సీన్ ఉందంటారా?

డైరెక్టుగా పాయింట్ లోకి వచ్చేస్తే… ఆంత విశ్వాసమో, అతి విశ్వాసమో లేక పీసీసీ పీఠం కోసం ఆడుతున్న క్రీడలో భాగమో కానీ… తాజాగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ఇంగ్లిష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమారు 50 మంది తెరాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. కానీ వాళ్లు మాత్రం తాను పీసీసీ చీఫ్ అయ్యేదాకా చూస్తున్నారని… తాను అలా పీసీసీ చీఫ్ అయ్యానో లేదో ఒక 50మంది టీఆర్ఎస్ ఎమెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోతారని చెప్పుకొస్తున్నారు!

ఈ మాటలు వింటుంటే… తాను టీపీసీ చీఫ్ అవ్వడానికి కోమటిరెడ్డి మరీ ఈ స్థాయిలో రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారే తప్ప.. ఆ మాటల్లో వాస్తవం ఏమాత్రం లేదనేది పలువురి మాటగా ఉంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణలో.. తెరాస ఎంత బలంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! మరోపక్క వర్గపోరుల్లో భాగమో, ఐకమత్య లోపమో, ప్రజల్లో బలమున్న నాయకత్వ లోపమో.. కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందో అస్సలు చెప్పనవసరం లేదు! ఉన్న పదిమందిలో ఎవరికి వారే తామే డాన్ అన్న రేంజ్ లో చెప్పుకోవడం మినహా… ఐకమత్యంతో తెరాసపై పోరాడాలనే ఆలోచన చేయడం లేదు!

ఈ పరిస్థితుల్లో.. తాను గనుక పీసీసీ చీఫ్ అయ్యానంటే… టీఆర్ఎస్ కు చెందిన 50 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వచ్చేయడంతోపాటు… తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి అన్నిరకాలుగా పాటుపడుతానని.. పాదయాత్రలు, బస్ యాత్రలు చేపట్టి.. నిత్యం ప్రజలతోనే ఉండి కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తానని చెబుతున్నారు కోమటి రెడ్డి! ఈ పనిచేయడానికి అధిష్టానం అనుమతి సరిపోతుంది కదా.. పదవి ఎందుకు అనే కామెంట్స్ వినిపిస్తోన్న తరుణంలో… పదవి ఇస్తేనే తీవ్రంగా పనిచేస్తాను అనే ఆలోచనలు చేస్తూ ఉన్నంతకాలం… ఎంతమంది వ్యక్తిగతంగా బలమైన నాయకులు ఉన్నా కూడా… తెలంగాణలో కాంగ్రెస్ ను కాపాడలేరు అనేది బలంగా వినిపిస్తున్న మాట. దీనికి ఒకటే పరిష్కారం ఏమిటంటే… పదవులతో సంబంధం లేకుండా అంతా ఐకమత్యంగా ఉంటూ ముందుకు వెళ్లడమే!!

ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్న జీవన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి.. మొదలైన బలమైన నేతలంతా ఒకతాటిపైకి వచ్చి, వ్యక్తిగత ఈగోలు పక్కనపెట్టి పక్కా ప్లానింగ్ తో పోరాడి పార్టీని బలోపేతం చేసుకోవాలే తప్ప… అసెంబ్లీ లో పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు కూడా లేని దుస్థితిలో కూడా ఎంతో బలంగా ఉన్న తెరాస నుంచి ఏకంగా 50 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారనే మాటలు మాట్లాడటం వల్ల నవ్వులపాలు తప్ప మరో ప్రయోజనం లేదని పలువురి అభిప్రాయంగా ఉంది!! ఏది ఏమైనా… కోమటి రెడ్డి ఏ ఆలోచనతో ఆ మాట చెప్పారో తెలియదు కానీ… ఈ కామెంట్స్ పై అధికార పక్షం నుంచి ఇంకా కౌంటర్స్ మాత్రం పడలేదు కానీ.. ఆన్ లైన్ లో మాత్రం విపరీతమైన కామెంట్స్ పడుతున్నాయి!!