మున్సిపల్ ఎన్నికల విజయం అనంతరం తెలంగాణా మంత్రి కేటిఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. పని చేయకపోతే పదవులు పోతాయని హెచ్చరించారు. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్ బిజెపి అపవిత్రమైన పొత్తు పెట్టుకున్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తెరాస ను గెలిపించారని అన్నారు.
120 మున్సిపాలిటీల్లో 112 తెరాసవె అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, మున్సిపల్ చట్టాన్ని తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు కలిపి 2 వేల 74 కోట్ల నిధులు రాబోతున్నాయని చెప్పారు. అక్రమ లే అవుట్ లను సహించేది లేదని స్పష్టం చేసారు. మున్సిపాలిటీల్లో జవాబుదారీ తనం పెంచుతామని కెసిఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేసారు.
నిబంధనలను అతిక్రమిస్తే హెచ్చరిక లేకుండా కూల్చేస్తామని చెప్పారు. నిజామాబాద్ మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు తమకు సహకరించిన మజ్లీస్ పార్టీకి కేటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన ప్రతీ హామీని తప్పకుండా అమలు చేస్తామని అన్నారు, పార్టీలో క్రమ శిక్షణ ప్రధానమని కేటిఆర్ అన్నారు. కాగా కరీంనగర్ మున్సిపాలిటిలో తెరాస 25 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.