ఎటూ తేల్చుకోలేక‌పోతున్న ఎల్‌.ర‌మ‌ణ‌.. కారెక్కుతాడా లేక క‌మలం వైపా?

తెలంగాణ రాజ‌కీయాలు ఇప్పుడు మంచి జోరుమీదున్నాయి. చేరిక‌లు, మార్పుల‌తో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈట‌ల రాజేంద‌ర్ చుట్టూ రాజ‌కీయాలు తిరిగితే.. ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లోకి ఎల్‌.ర‌మ‌ణ వ‌చ్చేశారు. ఆయ‌న టీఆర్ె స్‌లో చేరుతున్నారంటూ నిన్న‌టి నుంచి వార్త‌లు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఆయ‌న కూడా వీటిపై సానుకూలంగానే స్పందించారు.

త‌న‌ను మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు క‌లిశార‌ని ర‌మ‌ణ స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి కూడా ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈట‌ల రాజేంద‌ర్ దెబ్బ‌తో టీఆర్ ఎస్ కు బీసీల్లో ప‌ట్టుకోస‌మే ర‌మ‌ణ‌ను తెచ్చుకుంటున్నారని వార్తలు వ‌స్తున్నాయి.

అయితే ర‌మ‌ణ మాత్రం ఎటూ తేల్చుకోలేక‌పోతున్నార‌ని తెలుస్తోంది. ఎందుకంటే ఆయ‌న‌కు బీజేపీ నుంచి కూడా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. దీంతో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో టీఆర్ ఎస్ వైపు వెళ్లాలా లేక బీజేపీ వైపు వెళ్లాలా అని త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు. బండి సంజ‌య్ కూడా ఆయ‌న‌కు ట‌చ్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఆయ‌న మాత్రం టీడీపీని వీడ‌డం ఖాయ‌మ‌ని, కాక‌పోతే ఏ పార్టీలోకి వెళ్తార‌నేది తేలాల్సి ఉంది.