కేవలం ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్తున్న పవన్ కళ్యాణ్ ని కాపు సంఘం నేత హరిరామ జోగయ్య ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పవన్ లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో ఆయన వరుస బహిరంగ లేఖలతో ప్రశ్నలు సంధిస్తున్నారు.తాజాగా మరో లేఖతో పవన్ ని నిలదీశారు జోగయ్య. చంద్రబాబును గద్దెనెక్కించడానికి ఎవరూ సిద్ధంగా లేరని పవన్ కి కౌంటర్ వేశారు.కాపులను పవన్ ఏమాత్రం గౌరవించడం లేదని తేల్చి చెప్పారు.
ఇటీవల కాలంలో పొత్తులో ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య సీట్ల పంచాయతీ ఓ కొలిక్కి రావడం లేదు. పైగా పవన్ కళ్యాణ్ కలిసి ప్రతిసారీ సీట్ల కేటాయింపులో కోత విధిస్తున్నారు చంద్రబాబు. మొదట్లో 70 సీట్లు అడిగిన పవన్ కి ఇప్పుడు 28 సీట్లు మాత్రమే ఇస్తానని చంద్రబాబు ఫైనల్ చేసినట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో పోటీ చేయాలని జనసేన నేతలు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన తరపున అసెంబ్లీలో అధ్యక్ష్యా అని అనాలని ఆశ పడుతున్నారు.
అయితే చంద్రబాబు వైఖరి చూస్తే జనసేన నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లేనని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అన్నివిధాలుగా ఎన్నికలకు సిద్ధమైన జనసేన కేడర్ కు ప్రస్తుత టీడీపీ అధినేత తీరు ఏమాత్రం మింగుడుపడటం లేదు. కనీసం సీట్లు తేవడంలో పవన్ విఫలమయ్యాడని సొంత కేడర్ నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.
తాజాగా హరిరమజోగయ్య ఈ అంశాన్నే బలంగా ప్రస్తావిస్తున్నారు. పోటీ చేయడానికి కనీసం సీట్లు సాధించలేని వ్యక్తి కాపులకు ఏమి న్యాయం చేయగలడని జోగయ్య ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు వైఖరితో అనేకసార్లు మోసపోయామని చెప్తున్న జోగయ్య…. బాబుని గెలిపించేందుకు సిద్ధంగా లేరని ఎప్పుడూ చెప్తుంటారు. అయితే కాపులకు న్యాయం చేయగల వ్యక్తి పవన్ అని ఇటీవల చెప్తున్న హరిరమజోగయ్య…. సీట్లు సాధించలేని పవన్ అసమర్ధతను గట్టిగా తప్పు పడుతున్నారు.సీట్లు రాబట్టలేని వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతావంటూ పవన్ ని బహిరంగ లేఖ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.