నారా లోకేష్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. అది కూడా పార్టీ వద్దన్న మంగళగిరి నుంచి పోటీచేసి చిక్కుల్లో పడ్డారు. అయితే ఇప్పుడు మాత్రం పక్కా ప్లాన్ వేసుకుని మరీ ఎన్నికల్లో దిగుతున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. లోకేష్‌కు కలిసిరాని మంగళగిరి వద్దని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నారా లోకేష్ కొత్త నియోజకవర్గం గురించి విచారణ జరపుతున్నట్టు తెలుస్తోంది. తాజగా ఆయనకు పట్టున్న కొన్ని నియోజకవర్గాలపై అంతర్గతంగా లోతైన సర్వే చేయించిన పార్టీ అధిష్టానం ఒక నియోజకవర్గంపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అదికూడా ప్రఖ్యాతి గాంచిన విశాఖపట్నం జిల్లాలోని భీమిలీ నియోజకవర్గం అయితే లోకేష్‌కు సేఫ్‌గా ఉంటుందని భావిస్తున్నారంట.
ఈ నేపథ్యంలో ఆయన గుంటూరులోని మంగళగిరి నియోజకవర్గానికి గుడ్‌బై చెప్పినట్టేనని తెలుస్తోంది. పైగా ఆయన పెద్దగా మంగళగిరిలో పర్యటించట్లేదు కూడా. కాకపోతే ఇప్పుడు భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ను ఢీకొట్టడం చాలా కష్టమే అని చెప్పాలి. ఇక గతంలో కూడా లోకేష్ ఈ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని ప్రయత్నించినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగింది. చివరకు ఇక్కడ సబ్బం హరి పోటీ చేయడంతో ఆయన మంగళగిరికి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ సారి దీన్నే ఫైనల్ చేస్తారా లేదా అన్నది చూడాలి.