టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడిగా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన లోకేశ్.. ఎమ్మెల్సీ అయి మంత్రిగా కూడా పని చేశారు. అయితే, 2019 సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక టీడీపీ ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉండిపోయింది. అయతే, చంద్రబాబు వారసత్వాన్ని అందుకోవడంలో, పార్టీలో దూసుకుపోవడంలో లోకేశ్ తడబడ్డాడనే విమర్శలున్నాయి. మాట్లాడే క్రమంలో తడబడటం వల్ల సోషల్ మీడియా వేదికగా నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చేవి. ఇక ఏదైనా సభ జరిగినప్పుడు లేదంటే నేతలను ఎవరినైనా పరామర్శించేందుకు వెళ్లిన క్రమంలో లోకేశ్ వ్యవహరి శైలిపైన పలు ఆరోపణలు వచ్చేవి.
ఈ క్రమంలోనే లోకేశ్ ప్రస్తుతం చాలా మారిపోయారనే చర్చ టీడీపీ వర్గాల్లో వినిబడుతుంది. డ్రెస్సింగ్ స్టైల్ దగ్గరి నుంచి వ్యవహార తీరు వరకు అన్ని మార్చుకుంటున్నారు. యూత్‌ను అట్రాక్ట్ చేసేందుకు లోకేశ్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా హుందాగా ప్రవర్తిస్తున్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ వెళ్లి వారితో మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని కడిగిపారేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై చేసే విమర్శల్లోనూ ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కాగా, ఆయనలో ఇన్ని మార్పులు కనిపిస్తున్నప్పటికీ సీనియర్లు ఎవరూ లోకేశ్‌కు సహకరించడం లేదని టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి తమపైన పెత్తనం ఎలా చలాయిస్తాడని వారు అనుకుంటున్నట్లు వినికిడి. అయితే, చంద్రబాబుకున్న ఇమేజ్ లోకేశ్ సంపాదించుకోవడానికి చాలా టైం పట్టొచ్చనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ప్రస్తుతం తెలంగాణలో దాదాపుగా కనుమరుగువుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఏపీలోనైనా నిలదొక్కుకోగలుతుందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ క్రమంలోనే పార్టీలో నూతనోత్తేజం నింపేందుకుగాను ప్రణాళికలను టీడీపీ రచిస్తున్నట్లు సమాచారం.