యువగళం పేరుతో లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. రాయలసీమ జిల్లాల నుంచి..ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని..ఇప్పుడు ఉమ్మడి గుంటూరులో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైన మంగళగిరిలో పాదయాత్ర కొనసాగుతుంది. ఇక్కడే నాలుగు రోజుల పాటు లోకేష్ పాదయాత్ర చేయనున్నారు.
ఎలాగో పాదయాత్ర వల్ల నియోజకవర్గంపై దృష్టి పెట్టడం కుదరడం లేదు..అందుకే పాదయాత్ర నాలుగురోజుల పాటు చేసి ఇక్కడ బలం పెంచుకోవాలని లోకేష్ చూస్తున్నారు. ఇక మంగళగిరిలో ముగిశాక ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి లోకేష్ ఎంట్రీ ఇవ్వనున్నారు. 19, 20, 21 తేదీల్లో లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఇప్పటివరకు అన్నీ జిల్లాల్లో ఎక్కువ రోజులే పాదయాత్ర చేశారు. కానీ కృష్ణాలో కేవలం మూడు రోజులే పాదయాత్ర చేయనున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో లోకేష్ త్వరగా పాదయాత్ర ముగించాలని చూస్తున్నారని తెలిసింది.
అందుకే కృష్ణాలో మూడు రోజుల పాటే పాదయాత్ర ఉండనుంది. 19న విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్‌లో, 20న విజయవాడ తూర్పు, పెనమలూరులో, 21న గన్నవరం పర్యటించనున్నారు. లక్ష మందితో గన్నవరంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
అక్కడ టిడిపి నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళిన వల్లభనేని వంశీకి చెక్ పెట్టేలా సభ నిర్వహించాలని చూస్తున్నారు. ఇదే సమయంలో గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలో చేరనున్నారని తెలిసింది. మొత్తానికి మూడు రోజుల పాటు కృష్ణాలో పర్యటించి..హనుమాన్ జంక్షన్ రూట్ లో పశ్చిమ గోదావరిలో ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే మొదట రూట్ మ్యాప్ లో అవనిగడ్డ, పామర్రు, గుడివాడ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు రూట్ మారింది. దీంతో కృష్ణాలో తమ్ముళ్ళు నిరాశతో ఉన్నారు. కేవలం విజయవాడ పరిధిలోనే పాదయాత్ర ఉండటంతో మిగతా నియోజకవర్గాల తమ్ముళ్ళు నీరసపడ్డారు.