మహారాష్ట్రలో సంచలనం.. శివసేనదే సీఎం పీఠం..!

-

శివసేన.. మహారాష్ట్రలో చరిత్ర సృష్టించబోతోందా.. తొలిసారి సీఎం పీఠం అందుకోబోతోందా.. పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ శివసేన అభ్యర్థే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఇటీవల పదే పదే ప్రకటిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమంటూ బీజేపీ చేతులెత్తేసిన సమయంలో తొలిసారి ఆ పార్టీ నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం వచ్చింది.

సంజయ్ రౌత్ ఏమన్నారంటే.. “ బీజేపీ వారే ముఖ్యమంత్రి అవుతారని, వాళ్లే సర్కారును ఏర్పాటు చేస్తామని కమలనాథులు పదే పదే చెప్పారు. ఇప్పుడేమో వెనక్కి తగ్గారు. వారి అభ్యర్థి ముఖ్యమంత్రి ఎలా అవుతారు? ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఈ రోజు శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టతనిచ్చారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి శివసేనకు చెందిన వారే అవుతారు. ఉద్ధవ్‌ అలా చెప్పారంటే.. ఎట్టి పరిస్థితుల్లో శివసేన అభ్యర్థే సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతాం.”

అయితే శివసేనకు ప్రభుత్వాన్ని నిలుపుకోవడం అంత సులభమైన అంశమేమీ కాదు. 288స్థానాలున్న మహారాష్ట్ర శాసనసభ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్.. 145. ప్రస్తుతం బీజేపీకి 105మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శివసేనకు 56.. ఎన్సీపీకి 54 మంది మద్దతు ఉన్నారు. శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు తీసుకుంటే తప్ప ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా శివసేన సర్కారు ఏర్పాటుకు సహకరించే అవకాశం ఉంది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను కోరుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏం చేయాలనేదానిపై అధిష్ఠానం ఆదేశాలను అనుసరించి నడుచుకుంటామని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ తెలిపారు. మొత్తానికి మహా రాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. మరి శివసేన ఎలా చక్రం తిప్పుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news