రాష్ర్టాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించేందుకు.. ఐదు ప్రాంతీయ మండళ్లుగా ఏర్పాటు చేసి.. మంత్రి పదవులు దక్కని వాళ్లకు ప్రాంతీయ మండళ్ల చైర్మన్ పదవిని కట్టబెట్టాలని జగన్ యోచిస్తున్నారట.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరూ ఆశించారు. మాజీ మంత్రి నారా లోకేశ్‌పై ఆయన గెలవడం, మరోవైపు ప్రచారం సమయం నుంచే ఆళ్ల గెలిస్తే.. ఆయనకు మంత్రి పదవి ఇస్తానని జగన్ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇవ్వడంతో.. ఆళ్లకు మంత్రి పదవి గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. కానీ.. మొన్నటి మంత్రి వర్గంలో మాత్రం ఆళ్లకు చోటు దక్కలేదు. ఆయనకే కాదు.. చాలామంది ఆశావహులకు ఏపీ మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. దీంతో వాళ్లందరూ అధిష్ఠానంపై అలిగే అవకాశం ఉందని.. వాళ్లకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నగరి ఎమ్మెల్యే రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని ఖరారు చేశారు జగన్.
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని ఖరారు చేశారు. తాజాగా.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లకు సీఆర్‌డీఏ(క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) చైర్మన్ పదవిని కట్టబెట్టాలని జగన్ నిర్ణయించారట. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇవాళో, రేపో రానున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రాష్ర్టాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించేందుకు.. ఐదు ప్రాంతీయ మండళ్లుగా ఏర్పాటు చేసి.. మంత్రి పదవులు దక్కని వాళ్లకు ప్రాంతీయ మండళ్ల చైర్మన్ పదవిని కట్టబెట్టాలని జగన్ యోచిస్తున్నారట. 13 జిల్లాల్లో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, మిగిలిన జిల్లాలకు కలిపి మొత్తం ఐదు మండళ్లను ఏర్పాటు చేయనున్నారు.