భీమిలి టిక్కెట్టు గనక తనకు ఇవ్వకపోతే మంత్రి గంటా పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. అధికార పార్టీ టీడీపీ నుంచి పెద్ద ఎత్తున కీలక నేతలంతా వైకాపాలో చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపికి చెందిన పలువురు ముఖ్య నేతలు ఇప్పటికే వైకాపా తీర్థం పుచ్చుకోగా.. అదే బాటలో మరికొందరు నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కాగా ఇప్పుడు తాజాగా మరో ముఖ్య నేత కూడా వైకాపాలో చేరేందుకు సిద్ధమవుతున్నారట. నిజానికి ఆయన ఏపీ క్యాబినెట్‌లో కీలకమంత్రిగా ఉన్నారు. చంద్రబాబుకు దగ్గరి నేత. ఆయనే మంత్రి గంటా శ్రీనివాస రావు. ఆయన ఇప్పుడు వైకాపాలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.
గత కొద్ది రోజులుగా ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు టీడీపీలో అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. అందుకు కారణం లేకపోలేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి అసెంబ్లీకి ఈసారి ఆయనకు కాకుండా మరొకరికి టీడీపీ టిక్కెట్ ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం సాగింది. ఓ దశలో ఏపీ మంత్రి నారా లోకేష్‌ను ఆ స్థానం నుంచి పోటీకి దించుతారని, దీంతో గంటాకు ఎంపీ టిక్కెట్ ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో భీమిలి టిక్కెట్టును సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఇస్తారని తెలిసింది.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలో చేరితే భీమిలి అసెంబ్లీ టిక్కెట్టును చంద్రబాబు ఆయనకు ఇస్తారని తెలిసింది. దీంతో ఈ విషయంపై మంత్రి గంటా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే భీమిలి టిక్కెట్టు గనక తనకు ఇవ్వకపోతే మంత్రి గంటా పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై మంత్రి గంటా మాత్రం.. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా నడుస్తానంటూ కామెంట్ చేశారు. మరి ఆయనకు భీమిలి టిక్కెట్టు రాకపోతే మీడియాకు చెప్పినట్లే.. అధిష్టానం ఆదేశాల మేరకు ఊరికే ఉండిపోతారా, లేదంటే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా.. అన్నది మరో రెండు, మూడు రోజులు ఆగిస్తే తెలుస్తుంది..!