అధికార వైసీపీలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి..అసంతృప్తి జ్వాలలు చల్లారడం లేదు. తమ సొంత పార్టీపై విమర్శల జోరు కొనసాగిస్తున్నారు. మొదట నుంచి ఈయన ఏదో రకంగా సొంత పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తన నియోజకవర్గాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని, అభివృద్ధి చేయడం లేదని విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
తాజాగా కూడా రోడ్లు వేయకున్నా.. అభివృద్ధి పనులు చేపట్టకున్నా.. పింఛన్లు, నగదు బదిలీతో గెలిచేస్తామని అనుకోవడానికి లేదని, అసలు ఏం చేశామని ప్రజలని ఓట్లు అడగాలని చెప్పి ఇటీవల ఆనం సొంత ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. జగనన్న కాలనీల పేరిట లే అవుట్లు వేశామని, కానీ ఇళ్ళు కట్టించి ఇవ్వలేకపోయామని అన్నారు. పెన్షన్లతోనే ఓట్లు వస్తాయనుకుంటే పొరపాటే అని, గత ప్రభుత్వాలు కూడా పెన్షన్లు, పథకాలు ఇచ్చాయని అంటున్నారు. ఇలా కామెంట్ చేసిన ఆనం…ఇప్పుడు తాజాగా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే మాట్లాడుతున్నానని..సీనియర్ నేతగా చెప్పాలని భావించే.. వాస్తవాలను మాట్లాడానని చెప్పారు. కొందరు తాము వెంకటగిరికి ఇంచార్జ్‌గా వస్తామని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతున్నారని..ప్రస్తుతం ఎమ్మెల్యే నేనా లేక వేరేవారా అని ప్రజల్లో అనుమానం కలుగుతోందని అన్నారు.
ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నానని, ప్రజల అభిమానం మద్దతు తనకు ఉందని, వేరే స్థానానికి తాను ఎందుకు పోతానని, తన గురించి బాతు బచ్చాగాళ్లు మాట్లాడుతున్న మాటలను పట్టించుకోనన్నారు. అయితే వెంకటగిరి సీటు కోసం నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కూడా ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనకే సీటు ఖరారు అవుతుందని అంటున్నారు. దీంతో ఆయన వర్గం నేదురుమల్లి కాబోయే ఎమ్మెల్యే అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆనం..నేదురుమల్లిని టార్గెట్ చేసుకుని విమర్శలు చేసినట్లు అర్ధమవుతుంది.