నాగర్ కర్నూలు టీఆర్ఎస్ వర్గపోరులో పోలీసుల పాత్ర పై రగడ

-

నాగర్‌కర్నూలు జిల్లా టీఆర్‌ఎస్‌ రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మధ్య ఉన్న ఆధిపత్య పోరు అనూహ్య మలుపు తిరిగింది. టీఆర్ఎస్ లో ఉన్న అంతర్గత పోరు పై స్పందించిన కూచుకుళ్ల ఏకంగా పోలీసులను టార్గెట్ చేశారు. అనుచరులపై పోలీస్‌ కేసులు పెట్టడంతో ఒక్కసారిగా బరస్ట్‌ అయ్యారు. స్వపక్షంలో విపక్షంలా ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి గులాబీ గూటిలోకి వెళ్లారు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి. శాసనమండలిలో ప్రభుత్వ విప్‌గా కూడా ఉన్నారు. తనను, తన వర్గాన్ని అధికారులు పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం ఎమ్మెల్సీలో ఉందట. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా పోలీసులు పనిచేస్తున్నారని ఇటీవల కాలంలో వరసగా కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు స్వపక్షానికి చెందిన ఎమ్మెల్సీ కూడా పోలీస్‌ స్టేషన్లా.. కలెక్షన్‌ సెంటర్లా తాను పార్టీ మారబోతున్నట్టు జరుగుతున్న ప్రచారం వెనక పోలీసులే ఉన్నారని ఆరోపణలు చేయడం చర్చ గా మారింది.

ఎన్నికల వేళ ఎమ్మెల్యే మర్రి..ఎమ్మెల్సీ కూచుకుళ్ల సఖ్యత ఉన్నా.. తర్వాత గ్యాప్‌ వచ్చిందట. తన వర్గాన్ని మర్రి టార్గెట్ చేసినట్టు దామోదర్‌రెడ్డి ఆగ్రహంతో ఉన్నట్టు చెబుతున్నారు. కాంగ్రెస్‌ను వీడి గులాబీ కండువా కప్పుకొన్న సమయంలో తనతోపాటు వచ్చిన వారందరిపైనా ఎమ్మెల్యే కక్ష సాధిస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. చాలా మందిపై పోలీస్‌ కేసులు నమోదయ్యాయట. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా దామోదర్‌రెడ్డిని ఆహ్వానించడం లేదని విమర్శిస్తున్నారు. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్సీ తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారని అభిప్రాయపడుతున్నారు. పోలీసులను టార్గెట్‌ చేసినా దాని వెనక ఉద్దేశం వేరని చెవులు కొరుక్కుంటున్నారు.

సమస్య నాగర్‌ కర్నూలులోనే ఉన్నా..వర్గపోరు రోడ్డుమీద పడటంతో విషయం జిల్లా రాజకీయాల్లో రచ్చ లేపుతోంది. దామోదర్‌రెడ్డి కామెంట్స్‌పై ఎమ్మెల్యే మర్రి శిబిరం నుంచి స్పందన లేదు. ప్రత్యర్థులు కూడా ఛాన్స్‌ కోసం ఎదురు చూస్తున్నారట. ఈ ఎపిసోడ్‌లో ఇసుక అక్రమ రీచ్‌ల వ్యవహారం కూడా రావడంతో వివాదం ఎటు నుంచి ఎటు టర్న్‌ తీసుకుంటుందోనని చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news