ఏపీ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై టీడీపీ ఇవాళ స్పష్టమైన ప్రకటన చేసింది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు పార్టీలు కూడా మారుతున్నారు. టిక్కెట్ ఆశించి రానివారు వేరే పార్టీ తరఫునైనా పోటీ చేసేందుకు పార్టీలు మారుతున్నారు. ఇక ఏపీలో అధికార పార్టీ టీడీపీలో పలువురు ముఖ్యనేతలకు టిక్కెట్లు కేటాయించే విషయంపై ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు గత రెండు, మూడు రోజులుగా తీవ్రంగా తర్జన భర్జన పడుతున్నారు. అందులో భాగంగానే ఏపీ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, తన తనయుడు నారా లోకేష్‌ను ఏ నియోజకవర్గం నుంచి పోటీలో దింపాలా అని బాబు తీవ్రంగా ఆలోచించారు. అయితే ఆ విషయానికి ఆయన ఇవాళ ముగింపు పలికారు.
ఏపీ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై టీడీపీ ఇవాళ స్పష్టమైన ప్రకటన చేసింది. గత కొద్ది రోజులుగా నారా లోకేష్ ఏ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తారా.. అనే విషయంలో జోరుగా చర్చ కొనసాగింది. భీమిలి లేదా విశాఖ నార్త్ నుంచి లోకేష్ పోటీ చేస్తారంటూ కొన్ని రోజులు ప్రచారం సాగింది. ఆ తరువాత కుప్పం, పెనమలూరు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఒక వేళ లోకేష్ గనక భీమిలి నుంచి పోటీ చేస్తే తాను ఆ స్థానం వదులుకుంటానని మంత్రి గంటా కూడా చెప్పారు. కానీ ఎట్టకేలకు లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
కాగా లోకేష్‌ను రాజధాని ప్రాంతం మంగళగిరి నుంచి పోటీ చేయాలనే టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కోరాయట. అందుకనే సీఎం చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారట. అలాగే లోకేష్‌కు ఓటు హక్కు కూడా మంగళగిరి పరిధిలోనే ఉందట. దీని వల్లే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని లోకేష్‌ను మంగళగిరి నుంచి పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మరోవైపు మంత్రి శిద్దా రాఘవరావును ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని సీఎం చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారట. కానీ అందుకు శిద్దా సుముఖంగా లేరని తెలిసింది. మరి ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, ఎవరెవరు టీడీపీని వీడి వైసీపీలో చేరుతారో వేచి చూస్తే తెలుస్తుంది..!