టీడీపీకి ఇక‌, ఆ హోదా లేన‌ట్టే.. బాబు ఆశ‌లు గ‌ల్లంతే…!

-

ఏపీ విప‌క్ష పార్టీ, మాజీ అధికార పార్టీ టీడీపీ చిక్కుల్లో ప‌డిందా ?  ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్ర‌బాబు పెట్టుకున్న ఆశ‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గండి కొట్టిందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. 2012లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయిన‌ప్పుడు.. చంద్ర‌బాబు త‌న పార్టీ టీడీపీని జాతీయ పార్టీగా ప్ర‌క‌టించారు. ఇలా ప్ర‌క‌టించ‌డం ద్వారా జాతీయ స్థాయిలో పార్టీకి గుర్తింపు ల‌భించ‌డంతోపాటు, నిధుల‌ను కూడా స‌మీక‌రించుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఒరిస్సాలోనూ టీడీపీ ప‌క్షాన్ని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించి.. శ్రీకాకుళం నుంచి ఒరిస్సాతో సంబంధం ఉన్న నాయ‌కుల‌ను ప్రోత్స‌హించి.. అక్క‌డ కూడా టీడీపీ వింగ్‌ను ఏర్పాటు చేశారు.

ఇక, త‌మిళ‌నాడులోనూ టీడీపీ వింగ్‌ను ఏర్పాటు చేశారు. కొన్నాళ్లు.. దీనిపైనా బాబు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నారు. ఇక‌, ఇవే విష‌యాల‌ను వెల్ల‌డిస్తూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి చంద్ర‌బాబు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఆ వెంట‌నే ఆయ‌న అన‌ధికారికంగా టీడీపీని జాతీయ పార్టీగా ప్ర‌క‌టించారు. దీనికి జాతీయ అధ్య‌క్షుడుగా త‌న‌ను, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా త‌న కుమారుడిని కూడా ఎన్నుకొన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాష్ట్రాల వారిగా పార్టీ అధ్య‌క్షుల‌ను ప్ర‌క‌టించారు. తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడుగా ఎల్ ర‌మ‌ణ‌ను, ఏపీ పార్టీ అధ్య‌క్షుడుగా కిమిడి క‌ళా వెంక‌ట్రావును ప్ర‌క‌టించారు. ఇక‌, త‌ర్వాత వ‌చ్చిన ఎన్నిక‌ల్లో అంటే 2014లో ఏపీలో టీడీపీ కొలువుదీరింది. దీంతో పార్టీ కార్య‌క్ర‌మాల‌ను విస్త‌రించి.. మ‌రిన్ని రాష్ట్రాల్లో పాగా వేయాల‌ని భావించారు.


ఈ క్రమంలోనే ఢిల్లీలో కేజ్రీవాల్‌తోను, ప‌శ్చిమ బెంగాల్‌లో మ‌మ‌తా బెన‌ర్జీతోనూ చంద్ర‌బాబు దోస్తీకి సిద్ధ‌మ‌య్యారు. ఇక‌, తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోనే పార్టీ చ‌తికిల ప‌డింది. అధికారం కోల్పోయింది. అయితే, పార్టీకి 40శాతం ఓటు బ్యాంకు ల‌భించ‌డం గ‌మ‌నార్హం. కానీ, కేంద్ర ఎన్నిక‌ల సంఘం నియ‌మాల ప్ర‌కారం.. నాలుగు రాష్ట్రాల్లో ఏదైనా పార్టీ నిల‌క‌డ‌గా 6శాతం ఓటు బ్యాంకు క‌లిగి ఉంటేనే జాతీయ హోదా ల‌భిస్తుంది. కానీ, చంద్ర‌బాబు పెట్టుకున్న అభ్య‌ర్థ‌న మేర‌కు ఇప్పుడు కేవ‌లం ఏపీలో మాత్ర‌మే ఆ పార్టీకి స్థిర‌మైన ఓటు బ్యాంకు ఉంది. ప్ర‌తి ప‌దేళ్ల‌కు ఈ జాతీయ హోదాపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌రిశీల‌న చేస్తుంది.

ఈ క్ర‌మంలో తాజాగా కొత్త‌గా జాతీయ హోదా ప్ర‌తిపాద‌న‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న టీడీపీ విష‌యాన్ని ప‌రిశీలించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం చంద్ర‌బాబు పెట్టుకున్న ద‌ర‌ఖాస్తును తోసిపుచ్చిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఒక్క ఏపీలో త‌ప్ప‌.. ఆ పార్టీ పేర్కొన్న ఇత‌ర రాష్ట్రాల్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేక పోగా.. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు, ఓటు బ్యాంకు కూడా లేద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు పెట్టుకున్న అర్జీని బుట్ట‌దాఖ‌లు చేసింది. దీంతో టీడీపీకి జాతీయ పార్టీ హోదా ఇప్ప‌ట్లో వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదని కొంద‌రంటే.. అస‌లు రాద‌ని మ‌రికొంద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news