ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక చంద్రబాబునాయుడు సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. అటు ప్రభుత్వం పరంగా మార్పులు చేస్తూనే పార్టీలో కూడా అంతర్గత మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ నూతన అధ్యక్షునిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ ని నియమించారు. ఉత్తరాంధ్రకి చెందిన బీసీ నేతకే మళ్లీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అచ్చెన్నాయుడుకి మంత్రివర్గంలో చోటు దక్కడంతో అధ్యక్ష పదవి నుంచి తప్పించారు.కాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ చాలాకాలంగా పార్టీలో కొనసాగుతున్నారు. తాజాగా ఆయనకు సారథ్య బాధ్యతలు అప్పగించడంపై పలువురు బీసీ నేతలు హర్షం వ్యక్తపరుస్తూన్నారు.
పల్లా శ్రీనివాస్ రాజకీయ జీవితం విషయానికి వస్తే… అయన తండ్రి తెలుగుదేశం పార్టీలో పని చేశారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన పల్లా శ్రీనివాస్ ప్రజారాజ్యంతో రాజకీయ జీవితం ప్రారంభించారు. 2009లో ప్రజారాజ్యం నుంచి విశాఖపట్టణం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 2014లో గాజువాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు.2019లో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత విశాఖపట్టణం పార్టీ జిల్లాఅధ్యక్షుడిగా నియమితలయ్యారు. ఓడినా కూడా శ్రీనివాస్ ప్రజల మధ్య ఉన్నారు.
నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురి చేసినా తట్టుకుని నిలబడ్డారు.అంతేకాకుండా వైఎస్సార్‌సీపీ లోకి చేరాలని ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. వినకపోతే వ్యక్తిగతంగా దాడులకు పాల్పడినా శ్రీనివాస్ లొంగలేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న అతడి భార్య ద్వారా కూడా ఒత్తిడి, వేధింపులకు పాల్పడ్డినా శ్రీనివాస్ టీడీపీతోనే కొనసాగారు.
2024లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గాజువాక నుంచి పోటీ చేసి పల్లా శ్రీనివాస్ యాదవ్ అఖండ మెజార్టీతో గెలుపొందారు. 95,235 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై విజయం సాధించారు. ఏపీలో 2024 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో అతడిదే అత్యధిక మెజారిటీ. ప్రత్యేక హోదా కోసం చేసిన పోరాటమే అతడిని నాయకుడిగా నిలబెట్టింది. ఆయన్ని ఏకంగా పార్టీకి అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టింది. త్వరలోనే ఏపీ వ్యాప్తంగా ప్రత్యేక కార్యవర్గాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రులుగా అవకాశం దక్కని చాలామంది సీనియర్లకు పార్టీ కార్యవర్గంలో కీలక పదవులు కట్టబెట్టే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.అలా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.