తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి.దసరా పండుగ తర్వాత రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ అన్నివిధాలా కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితా తుది దశకు చేరుకున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మాసబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.తుది ఓటర్ల జాబితాపై పార్టీల సలహాలు, సూచనలు, అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 6న ఓటర్ల ముసాయిదా జాబితా, 21న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు సమాచారం. ఓటర్ల జాబితాలో ఎటువంటి సవరణలు లేకుంటే అక్టోబర్ నెలలో అనుకున్న పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.