పవన్ ప్రకటన; నేను కాకినాడ వస్తున్నా…!

-

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తనను అసభ్యపదజాలంతో దూషించిన ఎమ్మెల్యేను ఉద్దేశించి ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేసారు. అరాచక శక్తులతో దాడి చేయిస్తే వెనకడుగు వేస్తారనుకోవద్దు. సభ్య సమాజం ఛీత్కరించుకొనే పదజాలంతో ప్రసంగం చేసిన ప్రజా ప్రతినిధి తీరుపై నిరసన తెలియచేస్తున్న జనసేన కార్యకర్తలు, నాయకులపై వైసీపీ కార్యకర్తలు రాళ్ళ దాడికి పాల్పడటం అత్యంత దురదృష్టకరం.

ఒక ప్రజా ప్రతినిధి బాధ్యత లేకుండా అసభ్యకరంగా మాట్లాడిన విధం చూసిన ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. తప్పుని తప్పు అని చెబుతున్నవారిపై అరాచక శక్తులతో దాడులు చేయిస్తే జన సైనికులు వెనకడుగు వేస్తారనుకోవద్దు. అధర్మాన్ని ఖండించడమే జనసేన విధానం. రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్న ఆ ప్రజా ప్రతినిధిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా పోలీసు యంత్రాంగాన్ని కోరేది ఒకటే. పక్షపాతం లేకుండా ఇరు వర్గాలతో చర్చించి శాంతియుత పరిస్థితులు తీసుకురావాలి.

మా జనసేన కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం చేసి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తే ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా కాకినాడకు వచ్చి వారికి బాసటగా ఉంటాను. రాళ్ళ దాడిలో గాయపడిన జన సైనికులు, నాయకులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ప్రతి జన సైనికుడు వారికి ధైర్యాన్ని అందించి అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ఇదిలా ఉంటే పవన్ పై ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడంతో కాకినాడలో జనసేన సైనికులు ఎమ్మెల్యే ఇంటి ముందు నిరసనకు దిగారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు వారిపై దాడులు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news