కేరళకు వరదలు వస్తే అందరూ వచ్చారు కానీ.. శ్రీకాకుళానికి తుఫాను వస్తే ఎవరూ రాకపోవడం గమనార్హం అని ప్రధాని మోడీని ఉద్దేశించి పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తుఫాను నష్టాన్ని త్వరలోనే కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఉద్దానంలో ఇంకా కరెంటు రాలేదు.. కావాలంటే అధికారులను పంపించి క్రాస్ చెక్ చేసుకోగలరని అని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఏదో ఒకరోజు చూసి పోవటానికి తాను ఇక్కడికి రాలేదని.. సమస్యలపై క్షేత్రస్థాయిలో తెలుసుకునే ఇక్కడి నుంచి వెళతానన్నారు. ఈ విపత్తును జనసైనికులు ప్రపంచానికి తెలియజేయాలని పవన్ పిలుపునిచ్చారు. ఓట్ల కోసం కాదు.. సాయం చేయాలనే శ్రీకాకుళం వచ్చానని.. ఎన్నారైలు తితలీ బాధితులను ఆదుకోవాలని జనసేనాని పిలుపునిచ్చారు.
సహాయం కోరే హక్కుందికాబట్టే అడుగుతున్నా
తాను ప్రభుత్వాన్ని నిలబెట్టిన మనిషిని.. అందుకే సహాయం కోరుతున్నానని పవన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అధికార పార్టీ నేతలెవ్వరూ గ్రామాలకు రాకపోయినా.. తానొచ్చానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నేతలు, అధికారులను ప్రశ్నిస్తున్న యువతను కొందరు పనిగట్టుకుని వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉద్దానం కిడ్నీ సమస్యను ఏ విధంగా ప్రపంచానికి తెలియజేశానో.. తుఫాను నష్టాన్ని కూడా అదే విధంగా తెలియజేస్తానన్నారు. తుఫాను బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు.