జనసేన క్యాడర్ కు పవన్ వార్నింగ్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ముందుగా ఊహించిందే జరుగుతోంది. తొండ ఊసరవెళ్లిగా మారినట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్.. చంద్రబాబు సంస్థానంలో పర్మినెంట్ పాలేరు అవతారమెత్తారు. ఆరు నెలలు స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అన్న పవన్ ఇప్పుడు చంద్రబాబు దళంలోని గుంపులో మరో కట్టప్పగా మారుతున్నారు. తనను విమర్శించినా పట్టించుకోను అంటున్న పవన్.. చంద్రబాబుని తిడితే ఊరుకునేది లేదని సిగ్గు వదిలేసి చెప్తున్నారు.

ఈ విషయంలో తన సొంత కేడర్ కూ మినహాయింపు లేదంట. టీడీపీ పొత్తు విషయాన్ని ఆది నుంచి వ్యతిరేకిస్తున్న జనసేన లోని కొంతమంది ఇటీవల చోటుచేసుకుంటున్న పలు సంఘనల పట్ల అధినేతను ప్రశ్నించగా తన నిర్ణయం మారదని చెప్పేసారట. అంతకుమించి ఎక్కువ మాట్లాడితే నాలుక కోస్తా అనే రేంజిలో రెచ్చిపోతున్నాడట. ఇష్టం లేకపోతే పార్టీ వదిలివెళ్లి పోవచ్చని నిస్సిగ్గుగా చెప్పేస్తున్నారు.దీంతో జనసేన కేడర్ ,అధినేత వ్యవహారం చూసి విస్తూపోతున్నారట.పైగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఓడించడమే తన లక్ష్యమని బుకాయిస్తున్నారు.అధినేత వైఖరితో పార్టీ శ్రేణులు ఆలోచనలో పడ్డారు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్లు పవన్ తో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు సొంత డబ్బును ఖర్చు చేశారు. కేడర్ ను ఏర్పాటు చేసుకుని అధికార పార్టీ నియంత పాలనపై పోరాటం చేశారు. కేసుల్లో ఇరుక్కున్నారు. ఇలాంటి వీరసైనికులను చూసే కదా మోడీ, చంద్రబాబు లాంటివారు పవన్ కి విలువ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు. మరి ఇప్పుడు పోతే పొండి లేదంటే ఉండండి అన్నట్టు వ్యవహరించడం కేడర్ కు అసలు మింగుడు పడటం లేదట.

అంటే పార్టీ పెట్టింది ఎవరికో ఒకరికి తాకట్టు పెట్టడానికేనా అని కార్యకర్తలు అసహనానికి గురవుతున్నారు. అందరూ పవన్ కోసం పోరాడుతుంటే పవన్ మాత్రం చంద్రబాబు పల్లకీ మోసేందుకు సిద్ధం కావడం దారుణమని తిట్టుకుంటున్నారు జనసేన కేడర్. తాము కూడా పాలేర్లుగా మారక ముందే మంచి నిర్ణయం తీసుకోవడం ముఖ్యమని అనుకుంటున్నారు. అందుకే ఎన్నికల కంటే ముందే ఓ దారి వెతుక్కోవడం మంచిదనే భావనకి వచ్చేశారు.

మొదటి నుంచి కాపులంటే కమ్మ సామాజికవర్గానికి,కమ్మ అంటే కాపులకు పడట్లేదు. వీళ్ళిద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు తయారయ్యాయి. ఈ వైరం దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. ఆ మధ్య కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా హత్య వెనుక చంద్రబాబు పాత్ర ఉందని చెప్పినవాళ్ళు చాలామందే ఉన్నారు. ప్రముఖ కాపు నాయకుడు హరిరామ జోగయ్య సైతం చాలాసార్లు ఈ ఆరోపణ చేశారు.తనను చంపడానికి ప్రయత్నించారని ఆరోపించిన మరో కాపునేత కన్నా లక్ష్మీనారాయణ చివరికి ఆ పార్టీలోనే చేరారు.

ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు పంచన చేరి, ఆయన నిర్ణయాలనే ఫైనల్ చేసేయడం ఏమిటని పవన్ వైఖరిని తిట్టుకుంటున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేడర్ ను తాకట్టుపెట్టడం దారుణం అని అంటున్నారు. అంతమాత్రానికి పార్టీ పెట్టడం దేనికని మండిపడుతున్నారు. ఇలాగైతే రానున్న ఎన్నికల్లో పవన్ చాప చుట్టేయడం ఖాయమని, జనసేన పార్టీని టీడీపీలో విలీనం చేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news