ఏపీ పోలీసులకు పవన్ వార్నింగ్…!

నంద్యాలలో ఆటో డ్రైవర్ మరణంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. నంద్యాలలో ఆటో డ్రైవర్ శ్రీ అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దురదృష్టకరం అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక వ్యక్తి తన భార్య, బిడ్డలతో కలిసి ఉసురు తీసుకొన్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అంటే ఎంతటి ఒత్తిడిని, మానసిక వేదనను అనుభవించి ఉంటాడో అందరం అర్థం చేసుకోవాలన్నారు.

ఒక కేసు విచారణలో సలాం, అతని భార్యను పోలీస్ స్టేషన్ కు పిలిచిన నేపథ్యంలో ఈ ఆత్మహత్య చోటు చేసుకుంది అని, సలాం కుటుంబమంతా ఆత్మహత్య చేసుకొనే పరిస్థితులు కల్పించిందెవరు? అని ఆయన నిలదీశారు. అందుకు కారణమైనవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేసారు. పోలీసులు ఒత్తిళ్లకు తలొగ్గితే ఇలాంటి పరిస్థితులే వస్తాయి అని అన్నారు. అధికార పార్టీ నేతల చేతుల్లో ఆయుధాలుగా మారితే క్షేత్ర స్థాయి పోలీసులే ఇరుకునపడతారు అని హెచ్చరించారు. వారి ఆత్మహత్య కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.