ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా ఆ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తో చంద్రబాబు ఎన్నికలను వాయిదా వేయించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు, ఎస్‌ఈసీ రమేష్ ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారన్న ఆయన… రమేష్‌కు ఉద్యోగంలో కూడా చంద్రబాబు సాయం చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
నోటిఫికేషన్ కూడా ఇవ్వని మహారాష్ట్రలో వాయిదా వేశారనడంలో ఎలాంటి అర్ధం లేదని మంత్రి పెద్దిరెడ్డి రమేష్ కుమార్ పై మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో ఏదో జరిగిపోయిందని చంద్రబాబు అనవసర రాద్దాంతం చేస్తున్నారన్నారు. బ్లాక్ క్యాట్ సెక్యూరిటీలో ఉన్న చంద్రబాబు ఇంకా తాను ముఖ్యమంత్రి అనే భ్రమల్లో ఉన్నారని మంత్రి ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. జగన్ తలుచుకుంటే చంద్రబాబుకు విపక్ష నేత హోదా కూడా ఉండదన్నారు.
కరోనా సాకుతో స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం ఏ మాత్రం సరికాదని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు 3లక్షల కోట్లు అప్పు చేశారన్న ఆయన 60వేల కోట్లు బకాయిలు పెట్టారని, తాజాగా కేంద్రం నుంచి నిధులు రాకుండా చంద్రబాబు మోకాలడ్డుతున్నారని మండిపడ్డారు. అదే విధంగా స్థానిక ఎన్నికలు జరిగితే రాష్ట్రానికి రూ.5 వేల కోట్లు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేసారు.