యలమంచిలిలో ఎవరిదో మజిలీ

-

ఉమ్మడి విశాఖ జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలోని రెండు ప్రధాన పార్టీలకు ఈ నియోజకవర్గంలో పోటీ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఈ నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 3,00,097 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,49,547 మంది ఉండగా, మహిళా ఓటర్లు 1,50,545 మంది ఉన్నారు.ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ, నాలుగు సార్లు కాంగ్రెస్‌ పార్టీ, ఒకసారి వైసీపీ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు.

యలమంచిలి నియోజకవర్గంలో 1952లో జరిగిన ఎన్నికల్లో కేఎల్పీ నుంచి పోటీ చేసిన పి బాపునాయుడు తొలి ఎమ్మెల్యేగా గెలిచారు. 1955లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సీవీఎస్‌ రాజు, 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన వి సన్యాసి నాయుడు విజయం, 1967లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఎన్‌ సత్యనారాయణ విజయం సాధించారు. 1972లో జరిగిన ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్‌ అభ్యర్థి కేవీ కాకర్లపూడి గెలిచారు. 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వి సన్యాసినాయుడు విజయం సాధించగా 1983లో జరిగిన ఎన్నికల్లో కేకేవీఎస్‌ రాజు టీడీపీ నుంచి పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు.

1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు టీడీపీ అభ్యర్థి పప్పల చలపతిరావు విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి యూవీ రమణమూర్తిరాజు గెలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పి రమేష్‌బాబు విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన యూ రమణమూర్తిరాజు మరోసారి గెలుపొందారు. రానున్న ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి మరోసారి పోటీ చేసేందుకు రమణమూర్తిరాజు సిద్ధపడుతున్నారు. టీడీపీ నుంచి ఎవరు పోటీలో ఉంటారన్నది ఇంకా తేలలేదు.

తెలుగుదేశం పార్టీకి బాగా పట్టున్న యలమంచిలి నియోజకవర్గంలో ఈసారి కూడా వైసీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన పలు ప్రీపోల్ సర్వేల్లో ఫ్యాన్ పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చాయి. దీంతో రమణమూర్తిరాజు విజయంపై ధీమాగా ఉన్నారు. మొదటి సిద్ధం సభకు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గం నుంచే ఎక్కువ మంది ప్రజలు,వైసీపీ శ్రేణులు తరలివచ్చారని వైసీపీలో పెద్ద చర్చ జరిగింది.ఈసారి ఎన్నికల్లో వైసీపీ విజయబావుటా ఎగురవేయడం ఖాయమని విశ్లేషకులు చెపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news