భారత్‌లో కరోనా మహమ్మారి ఏమాత్రం ఆగడం లేదు. రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు అవుతోంది. ప్రతీరోజు దేశవ్యాప్తంగా లక్షకు చేరువలో కొవిడ్ కేసులు నమోదు అవుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు దేశంలో 53లక్షలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో 85,619 మంది వైరస్‌తోమరణించారు. ప్రధానంగా ఆరేడు రాష్ట్రాల్లోనే అత్యధికంగా వైరస్ ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబర్ 23న కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే ఈ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ కీలక విషయాలపై చర్చించి, దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరవుతారని వారు తెలిపారు. కాగా, చివరి సమావేశం ఆగస్టు 11న ప్రధాని మోడీ నిర్వహించారు. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.